● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్రుల నిర్వహణ ● ‘సృష్టి’ మోసంతో తనిఖీకి బృందాలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్రుల నిర్వహణ ● ‘సృష్టి’ మోసంతో తనిఖీకి బృందాలు

Aug 10 2025 6:29 AM | Updated on Aug 10 2025 6:29 AM

● జిల

● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్ర

చర్యలు తీసుకుంటాం

జిల్లాలో అనుమతులు లేకుండా ఎలాంటి ఆసుపత్రిని నిర్వహించినా శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. సంతాన సాఫల్య కేంద్రాలుగా నిర్వహించుకునేందుకు పూర్తిస్థాయి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలి. అనుమతులు తీసుకోకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, జిల్లా వైద్యాధికారి

మంచిర్యాలటౌన్‌: తల్లి కావాలన్న కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని దంపతులకు వరంగా మారాల్సిన సంతాన సాఫల్య కేంద్రాలు ప్రభుత్వ అనుమతి పొందకుండానే నిర్వహణ సాగిస్తున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి నగరాలకే పరిమితమైన ఫెర్టిలిటీ సెంటర్లు జిల్లాలోనూ వెలుస్తున్నాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రం మంచిర్యాలలో రెండు ఆస్పత్రులకు మాత్రమే ఫెర్టిలిటీ అనుమతులు లభించగా.. అందులో ఒక ఆస్పత్రికి ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌), మరో ఆస్పత్రికి ఐయూఐ(ఇంట్రా యూటిరైన్‌ ఇన్‌సెమినేషన్‌) విధానానికి మాత్రమే అనుమతి లభించింది. మరో రెండు ఆస్పత్రులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. రాకముందే గత కొంతకాలంగా నిర్వహిస్తుండడం గమనార్హం. ఇవి కాకుండా 10కి పైగా గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రసూతి ఆస్పత్రుల ముందు సంతాన సాఫల్య కేంద్రం బోర్డులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ఆయా ఆస్పత్రులు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం, కనీసం దరఖాస్తు కూడా చేయకుండానే ఆస్పత్రుల ముందు బోర్డులు ఏర్పాటు చేసి.. ఆస్పత్రి లోపల నోటీసు బోర్డులో మాత్రం ఐవీఎఫ్‌ సేవలు అందుబాటులో లేవని చిన్నపాటి అక్షరాలతో పెడుతున్నారు. సంతాన సాఫల్య కేంద్రం బోర్డులు చూసి పిల్లలు లేని దంపతులు ఎంతో ఆశతో ఆస్పత్రులకు వెళ్తే వారికి ప్రసూతి ఆస్పత్రుల్లో అందించే చికిత్స మాత్రమే అందిస్తున్నారు.

నగరాల్లోని ఆస్పత్రులతో కలిసి...

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి నగరాల్లో వెలిసిన ఫెర్టిలిటీ ఆసుపత్రులకు జిల్లాలోని పిల్లలు లేని దంపతులు వెళ్లేందుకు కొన్ని ఆస్పత్రులు సంతాన సాఫల్య కేంద్రాల బోర్డులను ఏర్పాటు చేసుకుని, ఆసుపత్రికి వచ్చిన దంపతులను నగరాల్లోని ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు సమాచారం. ప్రతీ నెలలో ఒకరోజు ఉచిత కన్సల్టెన్సీల పేరిట నగరాలకు చెందిన ఫెర్టిలిటీ కేంద్రాల ఆధ్వర్యంలో శిబిరాలను సంతాన సాఫల్య కేంద్రాల పేరిట బోర్డులను ఏర్పాటు చేసిన ప్రసూతి ఆసుపత్రుల్లో నిర్వహించి, ఆయా దంపతుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి మొదటగా వారి ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం, ఆ తర్వాత పిల్లలు కావాలంటే నగరంలోని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. వీరికి జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గైనకాలజిస్టులు ఎలాంటి ఫెర్టిలిటీ నిర్వహణ అనుమతులు తీసుకోకుండానే, సంతాన సాఫల్య కేంద్రాలుగా చికిత్స అందిస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

జిల్లాల్లో తనిఖీలు షురూ

ఇటీవల సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో జరిగిన మోసంతో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లతోపాటు అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో తనిఖీలకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేసింది. ఇక శుక్రవారం నుంచి జిల్లాల్లో తనిఖీలు మొదలు కాగా.. వరంగల్‌ జిల్లాలో తనిఖీలు చేశారు. మంచిర్యాల జిల్లాలో రెండింటికి మాత్రమే ఫెర్టిలిటీకి అనుమతులు ఉండగా, అనుమతులు లేకుండా పదికి పైగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. అందులో మరో రెండు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని, రాకముందే నిర్వహిస్తున్నారు. మిగిలిన ఆసుపత్రులకు అనుమతులు లేవు. పిల్లలు లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలపై తనిఖీ బృందం చర్యలు తీసుకుంటుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్ర1
1/1

● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement