
గద్దెరాగిడిలో భారీ చోరీ
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గద్దెరాగిడిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సింగరేణి కార్మికుడి ఇంట్లో 40 తులాల బంగారం, ఐఫోన్ అపహరించుకెళ్లారు. బాధితుల కథనం ప్రకారం.. భూపాలపల్లిలో సింగరేణి కార్మి కుడిగా పనిచేస్తున్న మేకల రాజయ్య గద్దెరాగిడిలో నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఇతర శుభకార్యాలు ఉండడంతో గురువారం ఇక్కడికి వచ్చారు. రాజయ్య దంపతులతోపాటు సమీప బంధువు సింధు, శ్రీనివాస్ దంపతులు కూడా వచ్చారు. రాజయ్య భార్య స్వరూపకు చెందిన 30తులాల బంగారు ఆభరణాలు, ఆమె చెల్లి కూతురు సింధు, శ్రీనివాస్ దంపతులకు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు వేర్వేరు పర్సులో పెట్టి నిద్రకు ఉపక్రమించారు. కాగా, రాత్రి మూడు గంటల ప్రాంతంలో రాజయ్యకు మెలకువ వచ్చి చూడగా పర్సులు చిందరగా పడి ఉన్నాయి. బంగారు ఆభరణాలు, ఐఫోన్ చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఆర్‌కేపీ ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి.. ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నూతన ఇంటి కిటికీలకు గ్రిల్ లేకపోవడంతో దొంగలు లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీ ఘటన పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.
40తులాల బంగారం, ఐఫోన్ అపహరణ