
తండాల్లో తీజోత్సవం
● గిరిజన గ్రామాల్లో మొదలైన సందడి ● పెళ్లికాని యువతులు నిర్వహించే పండుగ
తొమ్మిదో రోజు..
తొమ్మిదో రోజును ‘తీజ్ తోడేరో దాడో’ అని పిలుస్తారు. ఆ రోజు యువతులంతా ఇంటింటికీ వెళ్లి తీజ్‌లను తెంపడానికి అందరూ రావాలని ఆహ్వానిస్తారు. వారంతా వచ్చిన తర్వాత మంచె పైనున్న తీజ్ బుట్టలను కిందికి దించుతారు. కులదేవతలను పూజిస్తూ ‘తీజ్’ నారును తెంపుతారు. దానిని వరుసగా కూర్చున్న మగవారి తలపాగలో పెడతారు. ఆడవారైతే కొంగుకు కట్టుకుంటారు. మరికొందరు ఇంటి గుమ్మానికి కడుతారు. అనంతరం జొన్నరొట్టెలు చేసి డప్పు వాయిద్యాలతో తీజ్ నిమజ్జనానికి బయలు దేరుతారు. సమీపంలోని చెరువులు లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు ప్రక్రియను ‘తీజ్ ఎరాయోరో’ పిలుస్తారు. దీనిని ఒకరకంగా లంబాడీ బతుకమ్మగా కూడా భావిస్తారు. గోర్‌బంజారాలు నిర్వహించే ఈ పండుగలో వారి సంస్కృతి ఉట్టిపడుతుంది. పంచకట్టు, ఖమీజ్ రుపాట్ ధరించి పురుషులు, టుక్రి, కాంచ్లీ, చేతులకు బలియాలు వేసుకుని యువతులు, సంస్కృతికి తగ్గట్టుగానే తయారవుతారు. గడ్డి బతుకమ్మను తెచ్చి ఆడపడుచులు సోదరుల కాళ్లు కడుగుతారు. ఆపై పారే నీటిలో గడ్డి బతుకమ్మలను వదులుతారు.
కెరమెరి : తీజ్.. గిరిజన తండాల్లో తేజాన్ని నింపే పండుగ. గిరిజన యువతులు తమ ఆశలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించుకునే ఉత్సవం. ఆటపాటలు, విందులు, వినోదాలు, వినూత్న ఆచారాలతో బతుకమ్మ తరహాలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ వేడుకలు గిరిజన బంజారా (లంబాడా) తండాల్లో రక్షాబంధన్‌కు ప్రారంభమై కృష్ణాష్టమికి ముగుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
వేడుకల్లో నిమగ్నం..
గిరిజన లంబాడాలు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి నుంచి లంబాడా గిరిజనులంతా ‘తీజ్’ పండుగ జరుపుకోవడంలో నిమగ్నమయ్యారు. యువతులు కుల దేవతలను కొలుస్తూ బుట్టల్లో ఎర్రమట్టి నింపి అందులో గోధుమలు చల్లారు. వీటినే తీజ్ బుట్టలు అంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ‘తీజ్ భరాయిరో’ అని పిలుస్తారు. ఆ రోజు నుంచి యువతులంతా నియమ నిష్టలు పాటిస్తున్నారు. గ్రామ ప్రజలకు మంచి జరగాలని, తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ప్రతీరోజు మూడు పూటలా సమీపంలోని బావుల వద్దకు వెళ్లి నీటిని తీసుకువచ్చి బుట్టలపై చల్లుతున్నారు. ఆరు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ఏడో రోజు ‘ఢమోళీ’ సందడి
ఏడో రోజున ప్రతీ ఇంట్లో బియ్యపు పిండితో రొట్టెలు చేస్తారు. వాటిని బెల్లం, నెయ్యితో కలుపుతారు. ఈ మిశ్రమాన్నే చూర్మా అంటారు. ఈ చూర్మాను తీజ్ బుట్టలున్న ఇంటి ఆవరణలో నెలకొల్పిన కులదేవుడు ‘సేవాభయ్య’కు నైవేద్యంగా సమర్పిస్తారు. అదే రోజు ఇంటి సింహద్వారానికి ఎదురుగా జొన్నలతో నింపిన గోనె సంచులు, వాటి ముందు నీళ్ల కడవ ఉంచి అందులో వేప మండలు పేరుస్తారు. ఆ కడవ ముందు జొన్నపిండితో ముగ్గులు వేస్తారు. వాటి మధ్య వెండితో తయారు చేసిన ‘మేరామయాడి’ తల్లి విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించి పూజలు చేస్తారు. మేరామయాడి దేవత మాంసాహారి కావడంతో ఆమెకు మేకపోతును బలిస్తారు. ఆరోజు రాత్రి యువతులు ఇంటింటికీ వెళ్లి చూర్మా సేకరిస్తారు. వరసైన వారికి పూస్తూ నృత్యం చేయడంతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ కోలాహల ప్రక్రియనే ‘ఢమోళీ’గా వర్ణిస్తారు.
ఎనిమిదో రోజు ‘ఘంగోర్’ వివాహం
ఎనిమిదో రోజు యువతులంతా చెరువు వద్దకు వెళ్లి మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టితో ఆడ, మగ బొమ్మలను తయారు చేస్తారు. ఆడ బొమ్మకు గాంగ్రి, మగ బొమ్మకు ధోవతి, లాల్చితో వేషధారణ చేస్తారు. వాటిని మేళతాళాలతో తీజ్‌లు ఉన్న చోటుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ ఆ బొమ్మలకు ఘనంగా వివాహం జరిపిస్తారు. అక్కడే లాప్సీ (పాయసం) తయారు చేసి ఉత్సవ ప్రతిమలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గణ’ అంటే వారి కులదేవత ‘మేరామయాడి’ అని ‘గోర్’ అంటే కుల దేవుడు సేవాభయ్యా అని గిరిజనులు పిలుస్తుంటారు. వారిరువురికి ఈ రోజు పెళ్లి చేసినట్లు చెప్పుకుంటారు.
సంతోషంగా..
శ్రావణమాసంలో నిర్వహించే తీజ్ పండుగంటే మాకు ఎంతో ఇష్టం. బుట్టల్లో ఉన్న గోధుమలకు తొమ్మిది రోజులు నీళ్లు చల్లి చివరి రోజు ఉత్సవం జరుపుకుంటాం. ఇలా జరుపుకోవడం వల్ల అన్నికార్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. పాడి పంటలతో పాటు ఇంటిల్లిపాది, గ్రామస్తులు సుఖశాంతులతో ఉంటారు.
– జే.దివ్యరాణి, చందుగూడ, కెరమెరి

తండాల్లో తీజోత్సవం