
ఆదివాసీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలి
● ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ● అధికారికంగా ఆదివాసీ దినోత్సవం
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్‌లోని కుమురంభీం కాంప్లెక్స్‌లో ఉన్న సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అధికారిక వేడుకలకు హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీతో కలిసి భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, ప్రపంచ ప్రసిద్ధి పొందాయన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా పీవీటీజీ గిరిజనులు, ఒంటరి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా 180 అంబులెన్స్‌లను పీవీటీజీ గ్రామాల్లో ఏర్పాటు చేశామన్నారు. పీవో మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. పీవీటీజీ గిరిజనులకు ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా విద్య, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆదివాసీల సంప్రదాయ బద్ధమైన పూజలు, గుస్సాడీ నృత్యాలు, డోలు వాయిద్యాలతో కుమురంభీం ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, పేసా కోఆర్డినేటర్ వసంత్‌రావు, సర్‌మేడీలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీలు పాల్గొన్నారు.
ఆదివాసీ గ్రామాల్లో..
మండల కేంద్రంతో పాటు ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసీ నాయకులు కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆదివాసీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలి