
పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారం
● హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
రెబ్బెన: పోరాటాల ద్వారానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇప్పటి వరకు డైరెక్టర్ స్థాయి అధికారులతో కమిటీ సమావేశాలు జరిపినా కార్మికులకు సంబంధించిన ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. సొంతింటి పథకం అమలు, ఆదాయపు పన్ను మాఫీ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికై 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. యాజమాన్యంతో ములాఖత్ అయి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఇచ్చిన హామీలపై గనులపై నిలదీయాలని పిలుపునిచ్చారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కార్మికులందరికి రీ మెడికల్ నిర్వహించి అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సారయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, ఏరియా కార్యదర్శి శివారెడ్డి, ఏరియా ఆర్గనైజర్లు ఎస్‌కే ఇనూస్, మరిశెట్టి దత్తు, పిట్ కార్యదర్శి ఎండీ ఆరీఫ్, ఖైరిగూడ పిట్ కార్యదర్శి రామకృష్ణ, నాయకులు తిరుపతి, బాలేష్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.