
మలుపు తిరుగుతున్న సైబర్ నేరగాళ్ల కేసు
● దేశవ్యాప్తంగా నమోదైన కేసులు ● నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు
జన్నారం: సైబర్‌క్రైం, రామగుండం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్న సైబర్ నేరగాళ్ల కేసు మలుపులు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా వారిపై కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. జన్నారం ఎస్సై అనూష కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన వారిని హైదరాబాద్‌లోని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. గతంలోనే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి సదరు నిందితులు ఫోన్ చేసి రూ.10.20 లక్షలకు టోకరా వేసినట్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేయగా, జన్నారంలో పట్టుబడిన సైబర్ నేరగాళ్ల నుంచి ట్రేస్ చేసిన ఒక సెల్ నంబర్ నుంచే బాధితునికి ఫోన్ కాల్ పోయినట్లు తేలగా అక్కడి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
వివిధ రాష్ట్రాల్లోనూ కేసులు
మారుమూల జన్నారాన్ని కేంద్రంగా చేసుకున్న నిందితులు సుమారు వెయ్యి వివిధ నెట్‌వర్క్‌ల సిమ్‌లు వాడారు. కంబోడియా నుంచి ఆపరేటింగ్ చేస్తూ పెద్ద సైబర్ నెట్‌వర్క్ నడిపారు. వీరిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహాయంతో రామగుండం కమిషనరేట్ పోలీసులు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సైబర్ క్రైం అధికారులు, జన్నారం ఎస్సై అనూష సహకారంతో జూలై 30న పట్టుకున్నారు. కంబోడియాలో ఉంటున్న జాక్ అనే వ్యక్తి సూచనలతో పని చేస్తున్న మాన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన కాండ్రపు కామేశ్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బావు బాపయ్య, మధుకర్, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని గత నెల 30న జన్నారం ఎస్సై అనూష కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది. అయితే వీరిపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైబర్ క్రైం కేసులు నమోదైనట్లు సైబర్‌క్రైంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులో 18 కేసులు, తెలంగాణ లో 11 కేసులతోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వీరిపై కేసులు నమోదైనట్లు సదరు అధికారి ద్వారా తెలిసింది. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలకు మోసం చేయగా, అక్కడి సైబర్‌క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశా డు. విచారణ జరుపుతున్న అక్కడి పోలీసులకు ప ట్టుబడిన సైబర్ నేరగాళ్ల విషయం సమన్వయ పో ర్టల్ ద్వారా తెలియగా వారు దర్యాప్తు చేయగా కంబోడియాలో ఉంటున్న జాక్ సూచనలతో వీరి ప్యా నల్ ద్వారానే సైబర్ క్రైం జరిగినట్లు గుర్తించారని తెలిసింది. ప్రస్తుతం చంచలగూడ సెంట్రల్‌జైలులో ఉన్న నిందితులపై ఢిల్లీలోనూ కేసు నమోదైనట్లు సమాచారం. చిన్న గ్రామంలో సైబర్ నేరాలు ప్రా రంభించిన నిందితులు దేశవ్యాప్తంగా నేరాలకు పా ల్పడగా వారిపై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. త్వరలో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, మరి కొందరినీ అరెస్ట్ చేసే అవకాశముందని సదరు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై జన్నారం ఎస్సై అనూషను సంప్రదించగా, నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన మాట నిజమేనని ధ్రువీకరించారు.