
అవకతవకల నిరోధానికే సామాజిక తనిఖీలు
జన్నారం: ఉపాధి పనుల్లో అవకతవకల నిరోధానికే ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీ వో పీడీ కిషన్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావేదికకు హాజరై మాట్లాడా రు. 2024 ఏప్రిల్ 1నుంచి 2025 మార్చి 31వరకు చేపట్టిన పనులపై జూలై 24 నుంచి ఆగస్టు 4వరకు పంచాయతీల వారీగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 442 పనులకు గాను రూ.7.30 కోట్లు కూలీలకు వేతనాల రూపంలో, రూ.1.17 కోట్లు మెటేరియల్ రూపంలో ఇచ్చిన ట్లు తెలిపారు. 195 పంచాయతీరాజ్ రోడ్లకు రూ.5.59 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు గ్రామాలవారీగా సామాజిక తనిఖీ బృందం నివేదికలు చదివి వినిపించారు. ఇందులో రేండ్లగూడలో పాత షెడ్డుకే నిధులు మంజురు చేయించారని ఆ గ్రామానికి చెందిన దాముక కరుణాకర్ ఆరోపించగా, వివరణ ఇవ్వకపోతే డబ్బులు రికవరీ చేయాల్సి ఉంటుందని డీఆర్డీవో తెలిపారు. దుర్వినియోగమైన రూ.13వేలు రికవరికీ రాశారు. సామాజిక తనిఖీ అనంతరం జరిగిన ప్రజావేదిక సాదాసీదాగా జరిగింది. నివేదికలు చదివి వినిపించగా, డబ్బులు లెక్క తేలనివారికి రికవరీ రాశారు. ఆన్‌లైన్‌లో పనులు వివరాల నమోదుతో అక్రమాలు తగ్గినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో రాష్ట్ర టెక్నికల్ సభ్యుడు వేణు, సామాజిక తనిఖీ రాష్ట్ర కోఆర్డి నేటర్ రవి, సాయిలు, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఏపీవో రవీందర్, ఈసీ విలాస్, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.