
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
దండేపల్లి: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు నంబాల గ్రామానికి చెందిన కొండ గణేశ్ (32), ప్రవళిక దంపతులు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇద్దరూ కష్టపడి పనిచేస్తున్నా కుటుంబ అవసరాలకు డబ్బులు చాలడం లేదని గణేశ్ పలుమార్లు భార్యతో చెప్పుకుంటూ బాధపడేవాడు. ఈక్రమంలో మంగళవారం కూలీ పని నిమిత్తం ప్రవళికను బైక్‌పై తీసుకెళ్లి గ్రామ సమీపంలోని పత్తిచేను వద్ద దింపి వెళ్లాడు. మధ్యాహ్నం నంబాల బ్రిడ్జివద్ద పురుగుల మందు తాగి విషయాన్ని సోదరుడు రమేశ్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వెంటనే లక్సెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
రైలు కిందపడి ఒకరు..
కాగజ్‌నగర్‌టౌన్: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సురేష్‌గౌడ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని కాపువాడకు చెందిన మహ్మద్‌షబ్బీర్ (52)మద్యానికి బానిసై ఇంట్లో కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం తెల్లవారుజామున రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బెల్లంపల్లి నుంచి బల్లార్షాకు వెళ్ళే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
భుక్తాపూర్‌లో యువతి..
ఆదిలాబాద్‌టౌన్: ఉరేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో చోటు చేసుకుంది. ఉట్నూర్‌కు చెందిన మౌనిక (25) ఆదిలాబాద్ పట్టణంలోని ఓ చెప్పుల దుకాణంలో పనిచేస్తూ భుక్తాపూర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. సాయంత్రం షాపు నుంచి ఇంటికి వెళ్లిన యువతి ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు.
భార్య కాపురానికి రావడం లేదని ఒకరు..
మందమర్రిరూరల్: భార్య కా పురానికి రావడం లేదని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఏఎస్సై మజీద్‌ఖాన్ తెలిపిన వివరాల మేరకు మందమర్రిలోని రెండవ జోన్‌కు చెందిన సింగరేణి కార్మికుడు శనిగారపు కార్తీక్ (30)కు హనుమకొండకు చెందిన లాస్యతో 2018లో వి వాహమైంది. దంపతులకు కుమారుడు ఆర్యన్ (7), కూతురు ఆరాధ్య (5) ఉన్నారు. కుటుంబంలో గొడవలు జరగడంతో నెలరోజుల క్రితం లాస్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గు రై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. మృతుని అన్న సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
కడెం కాలువలో గుర్తుతెలియని మృతదేహం
దస్తురాబాద్: కడెం ఎడమ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. మల్లాపూర్ గ్రామ సమీపంలోని కడెం ఎడమ కాలువలోని ముళ్లపొదల్లో మంగళవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థాని కుల సాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. పూర్తిగా కుళ్లిపోయి ఉందని, మృతునికి 45 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..