
టైగర్‌జోన్‌లో భారీ వాహనాలకు త్వరలోనే అనుమతి
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలకు త్వరలోనే అనుమతులు వస్తాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీ శాఖ వైల్డ్ లైఫ్ బోర్డ్ సమావేశంలో పలు విషయాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం విలేకరులతో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు అటవీ చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకకు సహకరించాలని, అటవీ హక్కు చట్టం ప్రకారం అడవిలో ఉండే ఆదివాసీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీలు, ఇతర రైతులను ఇబ్బంది పెట్టవద్దని, పోడు భూముల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు సహకరించాలని, గ్రామాల్లో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, బఫర్‌జోన్‌ను రద్దు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు. తాత్కాలికంగా రోడ్లు, వంతెనలకు సహకరించాలని, ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఒంటెద్దు పోకడలకు పోతే ఓపిక నశించి ప్రజలు తిరుగుబాటు చేస్తారని, ఈ విషయంపై ఆలోచించాలని, పై విషయాలపై వైల్డ్‌లైఫ్ బోర్డ్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. త్వరలోనే భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేస్తారని ఆశభావం వ్యక్తం చేశారు.