
భార్యను హత్యచేసిన భర్త అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ వేణుచందర్
జైపూర్: మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వడం లేదని భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వేణుచందర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని నర్వ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గోదారి రాజయ్య మద్యానికి బానిసయ్యాడు. వచ్చిన పెన్షన్ డబ్బులు తాగుడుకు సరిపోకపోవడంతో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న అతని భార్య రాజమణిని తరచూ డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఈ విషయంలో ఇద్దరికి తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 2న ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కర్రపై రాజమణి తలపై కొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్సై శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.