
అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు తీసుకోవాలి
జన్నారం/దండేపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వైద్యసిబ్బంది అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం, దండేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జన్నారంలో సెలవులో ఉన్న వైద్యురాలు లక్ష్మికి మెమో జారీ చేయనున్నట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పరిశుభ్రత, దోమలు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అసంక్రమణ వ్యాధుల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారి ఉమాశ్రీ, జిల్లా మాస్‌మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.