
టీఏంసీ వేధింపులపై కలెక్టర్‌కు ఫిర్యాదు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీ టౌన్ మిషన్ కోఆర్డినేటర్(టీఎంసీ) రామకృష్ణ వేధింపులకు గురి చేస్తున్నారని చెన్నూర్ మెప్మా సభ్యురాళ్లు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని మరింత వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రుణగ్రహీతల నుంచి డబ్బులు ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలి సింది. రుణాలు పొందిన వారి నుంచి డబ్బు ఇప్పించని సభ్యురాళ్లను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని సమాచారం. గతంలో ఇక్కడ పని చేసిన మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తానని టీఎంసీ హామీపత్రం రాసిచ్చినట్లు తెలిసింది. ఆ కమిషనర్ బదిలీ కావడంతో మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్న టీఎంసీపై చర్యలు తీసుకోవాలని, ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఇటీవల చెన్నూర్‌లో పర్యటించిన మంత్రి వివేక్‌కు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.