
ఇక ఇంటర్‌లో ముఖగుర్తింపు
● నిలిచిన బయోమెట్రిక్ సేవలు ● కళాశాలల్లో విద్యా సంస్కరణలు ● విద్యా నాణ్యత పెంపొందించే చర్యలు ● ఆధునిక సాంకేతికతతో హజరు పర్యవేక్షణ
మంచిర్యాలఅర్బన్:ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో అనేక మార్పులు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఫేషియల్ రికగ్నేషన్ అమలు చేస్తోంది. పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించింది. ఇక, జూనియర్ కళాశాలల్లోనూ సంస్కరణలపై దృష్టి పెట్టింది. జూనియర్ కళాశాలల్లో బోధనా పద్ధతులు, హాజరు పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకే తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక విద్యార్థులు, అధ్యాపకుల హాజరు కోసం ముఖ గుర్తింపు హాజరు నమోదుకు కసరత్తు చేస్తోంది. ఈ సంస్కరణలు విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి దోహదపడనున్నాయి.
ఆధునిక సాంకేతికతతో హాజరు..
ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేస్తున్నారు. అయితే, 20 రోజులుగా కేంద్ర ప్రభుత్వ యుడాయి సంస్థతో ఒప్పందం ముగియడంతో నెట్‌వర్క్ సమస్యలు, బ్యాటరీ లోపాలు వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని అధిగమించేందుకు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ముఖ గుర్తింపు సాంకేతికత (ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ)ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థ హాజరు నమోదులో కచ్చితత్వాన్ని, సమయపాలనను నిర్ధారిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..
ఉమ్మడి జిల్లాలో 49 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 20,083 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే కళాశాలల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. ప్రతీ క్లాస్‌రూమ్, ల్యాబ్, ప్రిన్సిపాల్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించబడతాయి. దీంతో హైదరాబాద్ నుంచి అధికారులు తరగతులు, బోధనా పద్ధతులు, సమయపాలనను పర్యవేక్షిస్తారు. ఇంటరాక్టివ్ సీసీ కెమెరాలు లోపాలను సవరించుకోవడానికి మరియు బోధన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
బయోమెట్రిక్‌లో సాంకేతిక సమస్య..
గతంలో అమలు చేసిన బయోమెట్రిక్ విధానంలో నెట్‌వర్క్ సమస్యలు, సిమ్ లేదా బ్యాటరీ లోపాలు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ముఖ గుర్తింపు సాంకేతికత అమలు చేయడం ఒక వినూత్న చర్య. ఈ విధానం హాజరు నమోదులో పారదర్శకతను పెంచడంతోపాటు, సాంకేతిక లోపాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త విధానం విజయవంతంగా అమలు కావాలంటే, సిబ్బంది, విద్యార్థులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అవసరం.
జిల్లాల వారీగా కళాశాలలు,
విద్యార్థుల వివరాలు..
జిల్లా ప్రభుత్వ విద్యార్థులు
కళాశాలలు
మంచిర్యాల 10 4,320
నిర్మల్ 15 4977
ఆదిలాబాద్ 13 6,606
ఆసిఫాబాద్ 11 4180