
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
నిర్మల్: మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..నర్సాపూర్(జి) మండలం కుస్లీ గ్రామానికి చెందిన తోకల చిన్న సాయిలు (28) గత నాలుగేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెందాడు. ఆదివారం గ్రామంలోని క్రీడాప్రాంగణం బోర్డుకు ఉరేసుకున్నాడు. గ్రామస్తురాలు ముచ్చల గంగామణి గమనించి మృతుడి అన్న నడిపి సాయిలుకు సమాచారం అందించింది. నడిపి సాయిలు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కడుపునొప్పి భరించలేక వృద్ధుడు..
బోథ్: కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీసా యి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రైతు దాసరి లక్ష్మారెడ్డి (76) గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గతనెల 31న నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చాడు. ఎంతకీ కడుపు నొప్పి తగ్గలేదు. ఆ బాధ భరించలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య భోజాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పురుగుల మందు తాగి యువకుడు..
సిరికొండ: మతిస్థిమితం కోల్పోయి యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై కాంత్లే రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన కినక జుగదీరావ్(26) గతకొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. శనివారం ఉదయం తల్లి గమనించి వెంటనే 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
తల్లి మందలించిందని యువతి..
చింతలమానెపల్లి: తల్లి మందలించిందని యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని రవీంద్రనగర్–2 గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ఇస్లావత్ నరేశ్ కథనం ప్రకారం.. మండలంలోని రవీంద్రనగర్–2 గ్రామానికి చెందిన రీమా మండల్(20) ఇంటర్ విద్య అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లింది. అక్కడ ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం తల్లి రంజితతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. తల్లి తీవ్రంగా మందలించింది. ఇరువురి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా రీమా ఆవేశానికి లోనైంది. తల్లి, మరో సోదరి ఉన్న గదికి గడియపెట్టి పక్కన ఉన్న మరో గదిలో ఉరేసుకుంది. గడియ పెట్టిన విషయాన్ని ఫోన్ ద్వారా పొరుగువారికి తెలియజేయగా వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రీమా మండల్ మృతిచెందింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య