
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గోడ్కే మిలింద్ కుమార్ (38) చికిత్సపొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి..జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన మిలింద్ కుమార్ ఇచ్చోడలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్తుండగా దేవాపూర్ వద్ద రోడ్డు పక్కన బైక్‌తో సహా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలిస్తుండగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజమ్మ తెలిపారు.
చుచుంద్‌లో ఒకరు..
భైంసారూరల్: మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన మహాలింగి పోశెట్టి(47) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పోశెట్టి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం లేక మదనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య మహాలింగి కవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.