
జన్నారం.. కేరాఫ్ సైబర్ క్రైం!
● అడ్డాగా మార్చుకున్న మోసగాళ్లు
● సైబర్ నేరగాళ్ల పట్టివేతతో ఆందోళన
● పట్టుబడనివారెందరో?
అపరిచితులను నమ్మొద్దు..
అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వాట్సప్ మెస్సేజ్, ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దు. లాటరీ తగిలిందని, లోన్ ఇప్పిస్తామని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అడిగితే సమాచారం ఇవ్వొద్దు. అలాంటి వాటికి స్పందించొద్దు. మోసపూరిత కాల్స్ వచ్చినట్లు అనుమానం వస్తే సైబర్‌క్రైం నంబర్ 1930కు ఫోన్ చేయాలి. మోసపోయినవారు పోలీస్టేషన్‌కు వచ్చేముందే 1930 కు ఫోన్ చేసి రిపోర్టు చేయాలి.
– రమణమూర్తి, సీఐ, జన్నారం
జన్నారం: చుట్టూ.. కవ్వాల్ అభయారణ్యం. దట్టమైన అడవి మధ్యలో పచ్చని పల్లెలు.. నేరాలు మోసాలు తెలియని అమాయక ప్రజలు. ఎవరి పని వారు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారిపై కొందరు మోసగాళ్ల కన్ను పడింది. జన్నారాన్ని అడ్డాగా మార్చుకుని.. ప్రజల అమాయకత్వానే పెట్టుబడిగా మార్చుకుని మోసాలకు పాల్ప డుతున్నారు. ఇటీవల పట్టుబడిన సైబర్ నేరగాళ్లే ఇందుకు నిదర్శనం. మారుమూల ప్రాంతమైతే ఎవరికీ అనుమానం రాని జన్నారాన్ని అడ్డాగా చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల్లో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే రోజూ లాభాలు, రెండు గుంటల భూమి రిజిస్ట్రేషన్ వంటి ఆకర్షణీయమైన హామీలతో సైబర్ నేరగాళ్లు సుమారు రూ.5 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసానికి మేధావులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు సహా అనేకమంది బలయ్యారు.
వివిధ రూపాల్లో మోసాలు..
ఈ మోసాలు ఒకేరకంగా లేవు. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌లతో లక్షలు సంపాదించవచ్చని ఆన్‌లైన్ మోసాలు, నకిలీనోట్ల చలామణి వంటి విభిన్నరూపాల్లో జన్నారంలో నేరాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేరగాళ్లు మాయమాటలతో స్థానికులను మోసం చేస్తున్నారు. జన్నారంలోనే సైబర్ నేరాల సెటప్‌ను ఏర్పాటు చేసి, ఈ మోసాలను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలు స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.
బాధితుల కథనాలు..
గత ఐదేళ్లలో జన్నారంలో సైబర్ మోసాలు అనేకమందిని బాధితులను చేశాయి. ఒక రిటైర్డ్ అటవీ శాఖ ఉద్యోగి రూ.3 లక్షలు, ఒక ఉపాధ్యాయుడు ఓటీపీ షేర్ చేయడం ద్వారా రూ.2 లక్షలు, ఒక ప్రైవేట్ ఉద్యోగి మొబైల్ లింక్ ద్వారా రూ.40 వేలు నష్టపోయారు. ఇటీవల ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సైబర్ నేరగాళ్లు తమ్ముడిపై కేసు నమోదైందని బెదిరించి మోసం చేయబోయారు. అయితే, అతను అప్రమత్తంగా తమ్ముడితో సంప్రదించడంతో మోసం నుంచి తప్పించుకున్నాడు. ఇలా తెలిసిన బాధితులే ఇంతమంది ఉంటే, తెలియని వారి సంఖ్య వందల్లో ఉందని సమాచారం.
జన్నారం నుంచే సైబర్ మోసాలు..
జన్నారం మండలంలో సైబర్ నేరగాళ్లు స్థానికంగానే సెటప్ ఏర్పాటు చేసి మోసాలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. చిన్న సంఘటనలు జరిగే ఈ మండల కేంద్రంలో ఇంత పెద్ద నేరాలు జరుగుతుండడం, ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్‌యాదవ్, స్థానికంగా అందరికీ సుపరిచితుడు. అతనే ఈ నేరాలకు సహకరించినట్లు తెలిసి స్థానికులు నిర్ఘాంతపోయారు. రామగుండం పోలీసులు, సైబర్ క్రైం అధికారులు వీరిని అరెస్టు చేసినప్పటికీ, స్థాని కంగా నేరాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
అప్రమత్తతే శ్రీరామ రక్ష..
నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని తెలిసినవారే మోసాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఎవరికివారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మొబైల్ ద్వారా ఆన్‌లైన్ గేమ్‌లు, రుణాలు, బిజినెస్ ఆఫర్లు వంటి మాయమాటలతో లక్షలు కొల్లగొడుతున్నారు. కొందరు ఆన్‌లైన్ గేమ్‌లతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇంకా చైతన్యం అవసరం. గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మకుండా, ఓటీపీలు, లింక్‌లు షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

జన్నారం.. కేరాఫ్ సైబర్ క్రైం!