వంద సీట్లు గెలుస్తాం | - | Sakshi
Sakshi News home page

వంద సీట్లు గెలుస్తాం

Aug 4 2025 4:34 AM | Updated on Aug 4 2025 12:04 PM

వంద సీట్లు గెలుస్తాం

వంద సీట్లు గెలుస్తాం

నిర్మల్‌/ఖానాపూర్‌: సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికారంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటామని వెల్లడించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులతో ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ఏసీల్లో కూర్చోకుండా తమ నేత రాహుల్‌గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయా త్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్‌ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి

మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాలని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్‌గాంధీ ప్రేరణతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబాద్‌కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాడిన ఆదివాసీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్‌ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తోందని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని, గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి, తెలంగాణకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు లేదని, దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాది న్నర పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలుపుతూ.. సమస్యలు పరిష్కరించేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేషన్‌కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రెండోసారి అధికారంలోకి వస్తాం

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఖానాపూర్‌లో ‘జనహిత’ పాదయాత్ర

భారీగా తరలివచ్చిన నేతలు, శ్రేణులు

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి

మీనాక్షి, పలువురు మంత్రులు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement