
నకిలీ విత్తనాల సరఫరా అరికట్టాలి
● జిల్లా కలెక్టర్ బి.సంతోష్
మంచిర్యాలఅగ్రికల్చర్: నకిలీ విత్తనాల తయారీ, రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. బుధవారం నస్పూర్ కలెక్టరేట్‌లో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బోల్‌గార్డ్–3 రకాన్ని నిషేధించారని, వినియోగం చట్టరీత్యా నేరమని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలు నియంత్రించేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ బృందాలు నకిలీ, నిషేధిత విత్తనాల నిల్వ, పంపిణీ కేంద్రాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. గత నాలుగు నెలల కాలంలో నాలుగు కేసులు, 2016 నుంచి ఇప్పటి వరకు 116 కేసులు నమోదు చేశామని తెలిపారు.
మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రాములు, హరికృష్ణ, ఆబ్కారీ మద్యనిషేధ శాఖ అధికారి నందగోపాల్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చందన, మానసిక వైద్య నిపుణులు సునిల్‌లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, వినియోగం పూర్తి స్థాయిలో నిరోధించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని తెలిపారు. సీపీ మాట్లాడుతూ 22 కేసులు నమోదు చేశామని తెలిపారు.
పకడ్బందీగా లెక్కింపు ప్రక్రియ
మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.చంద్రకళతో కలిసి కౌటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది ఆ రోజు ఉదయం 7.30గంటల వరకు హాజరు కావాలని, 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 3న రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాటించాలని తెలిపారు.