
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రా జ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ అధికారులతో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయాలని, కేంద్రంలోకి సరైన అనుమతి లేని వారిని, మొబైల్ ఫోన్లను అనుమతించరాదని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఇతరత్రా ప్రతీ అంశంపై శ్రద్ధ తీసుకోవాలని, రౌండ్ల వారీగా ఫలితాలు వెలువరించే సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్, మీడియో సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ అంశాన్ని పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.