
పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ అన్నారు. కేంద్ర సర్వీసులకు చెందిన వివిధ శాఖల సహాయ విభాగాల అధికారులకు నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ‘విలేజ్ అటాచ్‌మెంట్ మాడ్యూల్’ అంశంపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24 వరకు కేంద్ర సర్వీసులకు చెందిన సహాయ విభాగాల అధికారులు శిక్షణలో భాగంగా జిల్లాలో వారికి కేటాయించిన గ్రామాల్లో పర్యటించి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, ఇందుకు సహాయంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని తెలిపారు. ప్రభు త్వ కార్యక్రమాల అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న పథకాలను నిశితంగా పరిశీలించాలని తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల పరిధిలో అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అనిత, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
● జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్