మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తే నేరస్తులకు శిక్షలు పడే శాతాన్ని పెంచవచ్చని ఎస్పీ డి.జానకి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జిషీట్ల దాఖలు, కోర్టు విచారణలపై చర్చించారు. దర్యాప్తు ప్రారంభ దశ నుంచే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సూచనలు తీసుకుంటే చట్టపరమైన లోపాలు లేకుండా పకడ్బందీగా కేసులు సిద్ధం చేయవచ్చన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో, తీవ్రమైన నేరాల కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బాధితులకు న్యాయం జరిగేలా బలమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సేవలను అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీడీ ప్రాసిక్యూషన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, పబ్లిక్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


