నవాబుపేట: ఓవైపు గ్రామ సమస్యలపై ఆరా.. మరోవైపు చిన్నారులతో సరదా సంభాషణలు.. ఇంకోవైపు గర్భిణుల ఆరోగ్యంపై ఆప్యాయంగా పలకరింపులు.. ఇలా అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఓ అమ్మలా, టీచరమ్మలా కలిసిపోయారు కలెక్టర్ ఖుష్బూగుప్తా. గ్రామ పర్యటనలో ప్రజా సమస్యలను తెలుసుకోవడమే కాకుండా.. చిన్నారులకు పాఠాలు బోధిస్తూ, మహిళలకు భరోసా కల్పిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. బుధవారం నవాబుపేట మండలంలోని పోమాల్, తిమ్మాయపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు.
గర్భిణులకు ఆప్యాయ పలకరింపు
పోమాల్ హెల్త్ సబ్‌సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ అక్కడికి వచ్చిన గర్భిణులతో మాట్లాడారు. లక్ష్మమ్మ హెల్త్‌కార్డును పరిశీలించి.. ఆరోగ్యం ఎలా ఉంది? ప్రతినెలా పరీక్షలు నిర్వహిస్తున్నారా? వైద్య సిబ్బంది తగిన సూచనలు ఇస్తున్నారా? అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఫ్యాన్లు తదితర కనీస సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పౌష్టికాహారంపై ఆరా..
పారిశుద్ధ్యంపై హెచ్చరిక
పోమాల్, తిమ్మాయపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం గురించి ఆరా తీశారు. గుడ్లు, పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. మరోవైపు పోమాల్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి లీకేజీలపై సమీక్షించారు. లీకేజీలను వెంటనే అరికట్టాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, వృథాను అరికట్టాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
బోర్డుపై పాఠాలు.. చిన్నారి సమస్యపై స్పందన
పోమాల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. వారి చదువుపై ఆరా తీయడమే కాకుండా.. స్వయంగా బోర్డుపై పాఠ్యాంశాలు రాసి బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అనిత అనే విద్యార్థిని బోర్డుపై రాసిన అక్షరాలు సరిగా కనిపించడం లేదని చెప్పడంతో వెంటనే స్పందించారు. ఆర్‌బీఎస్‌కే వైద్య బృందంతో విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు అందించాలని ఆదేశించారు. ఓ చిన్నారి చెప్పిన సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
ఓ వైపు ఆదేశాలు.. మరోవైపు ఆప్యాయతలు
చిన్నారులకు పాఠాలు.. గర్భిణులకు భరోసా
నవాబుపేట మండలంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా పర్యటన


