అడ్డాకుల: పండించిన పంటను అమ్ముకోవాలంటే దూరభారం.. రవాణా ఖర్చులు.. మార్కెట్‌కు వెళ్లేందుకు పడరాని పాట్లు.. ఇన్నాళ్లూ రైతులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులకు త్వరలో తెరపడనుంది. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల కేంద్రంగా కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మార్కెట్ యార్డు నిర్మాణం పూర్తయ్యే వరకు అడ్డాకులలోని పాత గ్రామ పంచాయతీ భవనంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ యార్డుతో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల రైతులకు ప్రయోజనం కలగనుంది.
దూరభారం తగ్గించేందుకే..
ఇప్పటివరకు అడ్డాకుల, మూసాపేట మండలాల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వనపర్తి జిల్లాలోని మదనాపురం మార్కెట్‌కు, భూత్పూర్ మండల రైతులు జడ్చర్ల (బాదేపల్లి) మార్కెట్‌కు తీసుకెళ్లాల్సి వచ్చేది. దూరప్రాంతాలకు పంటను తరలించడంలో రవాణా ఖర్చులు, సమయం వృథా కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతోంది.
తాత్కాలికంగా పాత పంచాయతీ భవనంలో..
కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు అడ్డాకుల పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాత్కాలికంగా మార్కెట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తయింది. ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం పంచాయతీ కార్యాలయాన్ని కొత్త భవనంలోకి మార్చనున్నారు. ఆ తర్వాత పాత భవనంలో మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మూడు మండలాలు..
ఒకే యార్డు
అడ్డాకుల శివారులోని సర్వే నంబర్ 161లో 6.5 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మదనాపురం మార్కెట్ పరిధిలో ఉన్న అడ్డాకుల, మూసాపేట మండలాలను, బాదేపల్లి మార్కెట్ పరిధిలోని భూత్పూర్ మండలాన్ని కొత్త యార్డు పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో మూడు మండలాల రైతులు తమ పంట ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. ఈ–నామ్ ద్వారా పారదర్శకంగా విక్రయాలు జరిగి మెరుగైన ధర పొందేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమైతే హమాలీలు, కూలీలు, ఇతర వర్గాల వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
రైతుల కోసం కొత్తగా
వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరు
అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు ప్రయోజనం
6.5 ఎకరాల్లో యార్డు ఏర్పాటు..
నిర్మాణం పూర్తయ్యే వరకు అడ్డాకులలో తాత్కాలిక కార్యాలయం
రైతన్నల సౌలభ్యం కోసమే..
దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తగా అడ్డాకులకు మార్కెట్ యార్డును ప్రభుత్వం మంజూరు చేసింది. రైతులు పండించిన పంటలను దూరంగా ఉన్న మార్కెట్లకు తరలించి విక్రయించడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే రైతుల సౌలభ్యం కోసం అడ్డాకులకు మార్కెట్ యార్డును తీసుకొచ్చాం. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మూడు మండలాల రైతులకు దీనివల్ల మేలు జరుగుతుంది. పంటల విక్రయాలు సులభతరం కావడంతో పాటు హమాలీలు, కూలీలకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు అడ్డాకుల పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాత్కాలిక మార్కెట్ కార్యాలయం ఏర్పాటు చేయిస్తాం. కొత్త యార్డు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తాం. – జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర


