మద్యం మత్తులోనే..
ఉండవెల్లి/రాజోళి: మండలంలోని కలుగోట్ల శివారులో శనివా రం రాత్రి ఆటో, కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కర్నూలు ఆస్పత్రిలో చికి త్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. శాంతినగర్‌కు చెందిన జోగి దుర్గన్న (42), వడ్డేపల్లి మండలంలోని తిమ్మాజిపల్లికి చెందిన శంకర్, పద్మమ్మ దంపతుల పెద్ద కుమార్తె వెటర్నరీ విద్యార్థిని లావణ్య (18) అలంపూర్ చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్తున్న ఆటోలో ప్రయాణిస్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఆటో ఢీకొట్టిన విషయం తెలిసిందే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం దుర్గన్న మృతి చెందగా.. సాయంత్రం లావణ్య మృతి చెందింది. తాళాల మరమ్మతు చేసుకుంటూ జీవనం సాగించే దుర్గన్నకు భార్య బాలమ్మ, నలుగురు కుమార్తెలు ఉండగా.. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఇద్దరికి పెళ్లిలు చేయాల్సిన సమయంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. లావణ్య తండ్రి రెండేళ్ల క్రితమే గుండెపోటుతో మృతి చెందగా.. తల్లి కష్టపడి కుమార్తెను వెటర్నరీ డాక్టర్‌గా చదివిస్తోంది. భర్త చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోక ముందే తనకు ఆసరాగా ఉంటుందన్న కుమార్తె కూడా మృతిచెందడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది. దుర్గయ్య అన్న అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థిని ఉషారాణి పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.
జోగి దుర్గన్న (ఫైల్)
లావణ్య (ఫైల్)
కారు డ్రైవర్ మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. బొంకూరు సమీపంలో మూతపడిన పెట్రోల్ బంకు వద్ద డ్రైవర్ కారు నిలిపి మద్యం తాగడం గమనించిన వాహనదారులు, రోడ్డు ప్రమాదం జరిగిన స్థలం వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అప్పటికే మద్యం తాగుతూ, కేకలు వేయడంతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా నడిపారని స్థానికులు తెలిపారు. ఇంతలోనే ఆటోనే ఢీకొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగాక కూడా ఏ మాత్రం తన తప్పు లేదన్నట్లుగా కారు డ్రైవర్ మహేష్ వ్యవహరించిన, మాట్లాడిన తీరు అందరికీ కోసం తెప్పించినప్పటికీ, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యామని వాహనదారులు తెలిపారు.


