● పోటాపోటీగా ఓవర్ టేక్ చేసేందుకు
ప్రయత్నించి బైక్ను ఢీకొట్టిన
రెండు కార్లు
● ఓ మహిళ మృతి.. భర్త,
ఐదేళ్ల కుమార్తెకు తీవ్రగాయాలు
● భూత్పూర్ మున్సిపాలిటీ
అమిస్తాపూర్ వద్ద సంఘటన
భూత్పూర్: పోటాపోటీగా ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి.. అతివేగంగా రెండు కార్లు ఒకదాని తర్వాత ఒకటి బైక్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త, ఐదేళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. అమిస్తాపూర్ గ్రామానికి చెందిన షాకీర్ తన భార్య సహానా బేగం (40), ఐదేళ్ల కుమార్తె ఆయారాతో కలిసి మోటార్సైకిల్పై మహబూబ్నగర్లోని బంధువుల వివాహానికి బయలుదేరారు. ఈ క్రమంలో భూత్పూర్ వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ థార్ కారు వారి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో థార్ కారు వారిపై నుంచి వెళ్లడంతో సహానా బేగం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షాకీర్, చిన్నారి ఆయారాను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. షాకీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు వెల్లడించారు. సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. కార్లలో మెడికల్ కళాశాల విద్యార్థులున్నారని, వారు పోటాపోటీగా ఓవర్టేక్కు ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిందితులు ఒకకారును సంఘటన స్థలంలోనే వదిలేసి.. మరోకారులో పారిపోయినట్లు తెలుస్తోంది.


