కరుణించు.. కాత్యాయనీదేవి! | - | Sakshi
Sakshi News home page

కరుణించు.. కాత్యాయనీదేవి!

Oct 17 2026 7:06 AM | Updated on Oct 17 2026 7:06 AM

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి వాకిటి

● అలంపూర్‌లో వైభవంగా

శరన్నవరాత్రి ఉత్సవాలు

● సింహవాహనంపై జోగుళాంబ,

బాలబ్రహ్మేశ్వరుల ఊరేగింపు

● అమ్మవారిని దర్శించుకున్న

పలువురు ప్రముఖులు

అలంపూర్‌: ‘కాత్యాయనీ మాతా.. పాహిమాం’ అంటూ భక్తులు అమ్మవారిని శరణు వేడారు. అలంపూర్‌ క్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీ జోగుళాంబ అమ్మవారు కాత్యాయనీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక మండపంలో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు కొలువు పూజ, దర్బారు సేవ, కుమారి పూజ, సువాసిని పూజలతోపాటు మంత్రపుష్పాలతో విశేష పూజలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. నవరాత్రుల్లో అమ్మవారికి దశమహావిద్యల పూజలు నిర్వహించడం విశిష్టమని అర్చకులు తెలిపారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసమన్నారు. ఆలయంలో కుంకుమార్చనలు, సహస్రనామ అర్చన, చండీహోమాలు, నవావరణ అర్చనలు కొనసాగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సింహవాహన సేవ..

అలంపూర్‌ క్షేత్రంలో ఆది దంపతుల కల్యాణ మ హోత్సవం కనుల పండువగా జరిగింది. కల్యాణం అనంతరం శ్రీ జోగుళాంబ అమ్మవారు, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను సింహవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పురవీధుల గుండా సింహవాహన సేవ సాగింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు స్వాగతం పలుకుతూ పూజలు చేశారు.

ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు

అలంపూర్‌ క్షేత్రంలోని శ్రీ జోగుళాంబ, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల ఆలయాలను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి దంపతులు స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమ పూజల్లో పాల్గొన్నారు.సినీ నటుడు శ్రీకాంత్‌ తన మిత్రులతో కలిసి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలంపూర్‌ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ అధికారులు భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేశారని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు నవరాత్రి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌జేడీ రామకృష్ణరావు, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, సినీ నటుడు ఛత్రపతి శేఖర్‌ తదితరులు కూడా ఆలయాలను దర్శించుకున్నారు.

జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ దీప్తి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు మంచి దిగుబడులు సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పనిచేసేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement