● సీఎం రేవంత్రెడ్డి నిజమైన పాలమూరు బిడ్డ అయితే ప్రాజెక్టును ఆపాలి
● పాలమూరు రైతులకు అన్యాయం చేస్తారా?
● మహబూబ్నగర్ డీకే అరుణ
జెడ్పీ సెంటర్ (మహబూబ్నగర్)/జడ్చర్లటౌన్: పాలమూరు జిల్లాను శాశ్వత కరువులోకి నెట్టే డిండి ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు నుంచి ముఖ్యమంత్రిని చేసినందుకు ఈ ప్రాంత రైతుల గొంతు కోస్తారా? అని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం జల సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో నిర్వహించిన పెండింగ్ ప్రాజెక్టుల అవగాహన సదస్సులో, జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు పులిబిడ్డనని చెప్పుకుంటే సరిపోదని, నిజంగా ఈ గడ్డపై పుట్టిన బిడ్డనని నిరూపించుకోవాలంటే డిండి ప్రాజెక్టును నిలిపివేయాలని అరుణ అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పక్కనపెట్టిన ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఎందుకు ప్రారంభించిందని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టును ఆపితేనే రేవంత్రెడ్డిని అసలైన పాలమూరు బిడ్డగా అంగీకరిస్తార ని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాకు నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ వంటి నీటి వనరులు ఉన్నాయని, గొట్టిముక్కల, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి నీటిని తరలించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కృష్ణా జలాలతోనూ పాలమూరు నేల దాహం తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రైతుల కష్టాలు, కరువు, వలసలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని నల్గొండ నాయకులకు సూచించారు. రైతుల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


