ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త!

Oct 17 2026 6:54 AM | Updated on Oct 17 2026 6:54 AM

● తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. క్షణాల్లో చోరీలు

● మహబూబ్‌నగర్‌లోని శ్రీనగర్‌, పోచమ్మ, లక్ష్మీనగర్‌, వెంకటేశ్వర కాలనీలపై చోరుల కన్ను

● అత్యవసర సమయంలో 87126 59360 నంబర్‌కు లేదా 112కు డయల్‌ చేయండి: ఎస్పీ

మహబూబ్‌నగర్‌ క్రైం: సెలవులొస్తే చాలు.. సొంతూళ్లకు, విహారయాత్రలకు వెళ్లేందుకు చాలామంది సిద్ధమవుతారు. ఇంటికి తాళం వేసి వెళ్లడమే కొందరికి కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న బంగారం, నగదు క్షణాల్లో మాయమవుతుండటంతో బాధితులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీనగర్‌ కాలనీ, పోచమ్మ కాలనీ, లక్ష్మీనగర్‌, వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, విలువైన వస్తువుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

కాలనీల్లో ప్రత్యేక నిఘా: ఎస్పీ

జిల్లాకేంద్రంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న కాలనీలను గుర్తించాం. వాటిని హాట్‌స్పాట్‌లుగా చేర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఆయా కాలనీల్లో చోరీలు జరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు పాత నేరస్తులపై ప్రత్యేక విచారణ చేపడుతున్నాం. పోలీసులను మఫ్టీలో ఆయా ప్రాంతాల్లో గస్తీకి పంపిస్తున్నాం. ప్రజలు కూడా ఇంటికి తాళం వేసి ఊరెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ఇంటి భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో 87126 59360 నంబర్‌కు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలి.

బాలాజీనగర్‌లో జరిగిన దొంగతనం (ఫైల్‌)

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం

నగరంలోని పలు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసంచారం తక్కువగా ఉండే శివారు ప్రాంతాలను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి అదును చూసి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నప్పటికీ చోరీల నియంత్రణ సవాలుగా మారుతోంది. సీసీఎస్‌ పోలీసులు దొంగిలించిన సొత్తును రికవరీ చేస్తున్నా.. అపహరణకు గురవుతున్న ఆస్తితో పోలిస్తే స్వాధీనం చేసుకుంటున్న సొత్తు తక్కువగా ఉంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చోరీ జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ఇంటికి సెంట్రల్‌ లాకింగ్‌ వ్యవస్థ, అలారం ఏర్పాటు చేసుకోవడంతో పాటు సీసీ కెమెరాలను మొబైల్‌ ఫోన్‌కు అనుసంధానించి పర్యవేక్షించాలి. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా వెల్లడించకూడదు. నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇవ్వడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించడం ద్వారా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement