వాతావరణంపై ముందస్తు సమాచారం | - | Sakshi
Sakshi News home page

వాతావరణంపై ముందస్తు సమాచారం

Oct 3 2026 12:50 AM | Updated on Oct 3 2026 12:50 AM

వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, తుఫాన్‌ ప్రభావం తదితర వివరాలను ముందుగానే తెలుసుకోవడానికి మౌసం, మేఘదూత్‌ వంటి యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. వాతావరణ సూచనలను బట్టి సాగు పనులను సమయానుకూలంగా చేపట్టడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): వ్యవసాయరంగంలోనూ సాంకేతికత వినియోగం పెరుగుతోంది. గతంలో పంటకు తెగులు సోకినా.. వాతావరణ పరిస్థితులు మారినా.. ఎరువులు, పురుగుమందులపై సమాచారం కావాలన్నా రైతులు వ్యవసాయ కార్యాలయాలు, అధికారులను ఆశ్రయించేవారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. పంట సాగు, సస్యరక్షణ, వాతావరణం, మార్కెట్‌ ధరల వరకు అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు యాప్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వాటి వినియోగంపై వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. ఏఐ, డ్రోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి సాంకేతికతలను సాగులో వినియోగించేందుకు కూడా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,05,236 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 2,97,200 ఎకరాల్లో సాగు చేపట్టారు. ఇందులో 1,45,269 ఎకరాల్లో వరి, 88,500 ఎకరాల్లో పత్తి, 27,900 ఎకరాల్లో మొక్కజొన్న, 18,573 ఎకరాల్లో కంది, 10,053 ఎకరాల్లో జొన్న, 1,000 ఎకరాల్లో పెసర, 670 ఎకరాల్లో మినుము, 4,263 ఎకరాల్లో కూరగాయలు ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలను సకాలంలో గుర్తించడం, సరైన మందులు వినియోగించడం, అవసరమైన మేరకే ఎరువులు వేయడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగుచేసిన పంటలకు డిజిటల్‌ సాంకేతికతను రైతులు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫొటో తీస్తే.. తెగులు తెలుస్తుంది

పంటలో కనిపించే పురుగు లేదా తెగులు ఫొటో తీసి సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సమస్యను గుర్తించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై సూచనలు పొందవచ్చు. దీంతో ప్రాథమిక సమాచారం కోసం ప్రతిసారీ వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. పంటల సాగు పద్ధతులు, సస్యరక్షణ, పురుగుమందుల వినియోగంపైనా డిజిటల్‌ వేదికల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఎరువుల బుకింగ్‌.. ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’

ఎరువుల విక్రయాన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎరువుల లభ్యత, పంపిణీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతో పాటు అవసరమైన ఎరువులను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. యాప్‌ వినియోగంపై రైతులకు అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

చీడపీడలపై ‘నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌’

పంటలను ఆశించే చీడపీడలను గుర్తించి నియంత్రించేందుకు నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టం యాప్‌ ఉపయోగపడుతోంది. రైతులు తమ వివరాలతో పాటు పంటకు సోకిన తెగులు, పురుగుల ఫొటోలను అప్‌లోడ్‌ చేయవచ్చు. సమస్యను గుర్తించిన అనంతరం తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సూచనలు పొందే అవకాశం ఉంటుంది. తొలిదశలోనే చీడపీడలను గుర్తించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

సలహాలు.. మార్కెట్‌ సమాచారం

కిసాన్‌ సంచార్‌, గ్రామ ఫోన్‌ వంటి డిజిటల్‌ వేదికల ద్వారా పంటలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు, మార్కెట్‌ ధరలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సేంద్రియ సాగు చేస్తున్న రైతులు, వారి ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్‌ వేదికపైకి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది.

రైతు చేతిలోకి డిజిటల్‌ సేద్యం

యాప్‌లతో క్షణాల్లో వ్యవసాయ సమాచారం

పంట సమస్యకు ఫొటో తీస్తే.. పరిష్కార మార్గం

చీడపీడల నివారణకు తక్షణ సలహాలు

సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించే అవకాశం

అవగాహనతో మరింత ప్రయోజనం

యాప్‌లు అందుబాటులోకి రావడం కంటే వాటిని రైతులు సులభంగా వినియోగించుకోవడం ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తే సమాచారం వేగంగా రైతులకు చేరుతుంది. పంట సమస్యలను సకాలంలో గుర్తించి సరైన సూచనలు పాటించడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గించడంతో పాటు దిగుబడులను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement