మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాల కోసం పీడీ భానుకిరణ్‌ను సంప్రదించాలని కోరారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 4వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17 విభాగాల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వీబీజీరామ్ జీ పథకం రద్దు చేసి, ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. కొత్త చట్టంలో 125 రోజులు పనిదినాలు పెంచినా నిధుల కేటాయింపులో భారీ కోత విధించిందని ఆరోపించారు. కూలీలకు పనిదినాలు 200 రోజులకు పెంచి రోజువారీ కూలి రూ.800 ఇవ్వాలన్నారు. ఆయా సంఘాల నాయకులు వి.హన్మంతు, మనోహర్, అంజి, రవి, మల్లెల మాణిక్యంరాజు తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు
మహబూబ్‌నగర్ రూరల్: కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. కుర్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురు మూర్తి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దళితుల హక్కులకు రక్షణ ఉండదని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాణిక్యంరాజు జెండాను ఆవిష్కరించారు. అనంతరం కుర్మయ్య, కురుమూర్తి మాట్లాడుతూ కేవీపీఎస్ ఆవిర్భావం తర్వాత దళితుల సమస్యలపై పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు. రాష్ట్రంలో 69 రకాల కుల వివక్ష రూపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కె.రాందాస్, వెంకట్రాములు, అనంతప్ప, సురేందర్, కడియాల మోహన్, మనోహర్, రవికుమార్, ఆంజనేయులు, హన్మంతు, చిన్నయ్య, ఫకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.


