పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టులు లేకపోవడంతో పెరుగుతున్న పెండింగ్ కేసులకు కొంతమేర పరిష్కారం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం విధానపరమైన అనుమతులు మంజూరు చేయగా.. ఉమ్మడి పాలమూరు పరిధిలో ఐదు జిల్లాలకు 11 కొత్త కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో న్యాయస్థానాలపై పెరుగుతున్న పనిభారం తగ్గడంతోపాటు కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.
ఏళ్లుగా పేరుకుపోతున్న కేసులు
ప్రతి ఏటా లోక్ అదాలత్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమవుతున్నా.. అదే సమయంలో కొత్త కేసులు కూడా కోర్టులకు వస్తున్నాయి. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. కొన్ని కోర్టుల్లో న్యాయమూర్తులు, మౌలిక వసతుల కొరత కూడా విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోంది.
విచారణ వేగవంతం అయ్యే అవకాశం
కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టుల సంఖ్య పెంచడం ద్వారా ఒక్కో న్యాయస్థానంపై ఉన్న భారాన్ని తగ్గించవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. కొత్త కోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కేసుల విచారణను విభజించడంతో పాటు కొత్తగా దాఖలయ్యే కేసులను కూడా త్వరగా స్వీకరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టుల ఏర్పాటు, న్యాయమూర్తుల అందుబాటు పెరగడం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కూడా దోహదపడే అవకాశం ఉంది. కొత్త కోర్టుల ఏర్పాటుతో న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కొంతమేర తగ్గనుంది.
ఉమ్మడి జిల్లాకు 11 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు
తగ్గనున్న కోర్టులపై కేసుల భారం
వేగంగా పరిష్కారం కానున్న పెండింగ్ కేసులు


