మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ దేవస్థానంలో శనివారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


