తాడూరు: ప్రమాదవశాత్తు కేఎల్‌ఐ కాల్వలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని యాదిరెడ్డిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము కథనం మేరకు మండలంలోని అకునెల్లికుదురుకు చెందిన రాజు (30) కూలీ పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై యాదిరెడ్డిపల్లికి వెళ్తూ రోడ్డు గుంతల మయంగా ఉండడంతో వాహనం అదుపుతప్పి సమీపంలో ఉన్న కెఎల్‌ఐ కాల్వలో పడిపోయి మరణించాడు. సమాచారం అందడంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య గౌరితోపాటు మూడు నెలల చిన్నారి ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
బీటెక్ విద్యార్థి దుర్మరణం
పోచారం: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందగా.. ఓ యువతి తీవ్రంగా గాయపడింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన బద్దుల కిషోర్ (19) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ ఇబ్బహీంపట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సం చదువుతున్నాడు. తన బంధువు పిల్లి విజయ (25)ను పరీక్ష రాసేందుకు శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు హెల్మెట్ ధరించకుండా స్కూటీపై తీసుకెళ్తుండగా యంనంపేట్‌లోని రైల్వే బ్రిడ్జిపైకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. ఘట్‌కేసర్ నుండి రాంపల్లి వైపు వెళ్తున్న బస్సును అధిగమిస్తున్న క్రమంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. స్కూటీ నడుపుతున్న కిషోర్, వెనక కూర్చున్న విజయ కింద పడిపోయారు. బస్ కండక్టర్ 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చింది. 108 సిబ్బంది పరీక్షించి కిషోర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన విజయను మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు వివరాలతో పాటు ఆధారాలను సేకరించారు. పరీక్ష కోసం బయలుదేరిన ప్రయాణం విషాదంగా ముగియడంతో కిషోర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థి మృతిపై స్థానికులు, మిత్రులు, కళాశాల బృందం తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ నల్ల కిషోర్ (29) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కసారిగా కుప్పకూలి వృద్ధురాలి మృతి
మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన చాకలి అంజనమ్మ (49) అనే వృద్ధురాలు శనివారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి కథనం మేరకు.. అంజనమ్మ శుక్రవారం ఉపాధిహామీ పనికి వెళ్లింది. పని ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు జడ్చర్లకు తీసుకెళ్లాలని చెప్పడంతో 108లో జడ్చర్ల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషయం స్థానికులు ఎంపీడీఓ లక్ష్మన్‌రాథోడ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయనతో పాటుగా స్థానిక సర్పంచ్ శంకర్, ఎపిఓ హైమావతి, టిఏ రవి, కార్యదర్శి సాయన్న మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు. మృతురాలికి భర్త శాంతయ్యతో పాటుగా ఇద్దరు కుమారులు ఉన్నారు.
అమ్మచెరువులో మళ్లీ ప్రత్యక్షమైన మొసలి
గోపాల్‌పేట: మండల కంద్రంలోని అమ్మచెరువులో శనివారం మొసలి మళ్లీ ప్రత్యక్షమైంది. సుమారు ఆరు నెలల క్రితం ఇదే చెరువులో రెండు మూడు రోజుల పాటు మొసలి బయటికి వచ్చి వెళ్లింది. ఆ తర్వాత కనిపించలేదు. మళ్లీ శనివారం ఉదయం చెరువు ఒడ్డుకు వచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు దగ్గరకు పెద్దసంఖ్యలో చేరుకొనొ ఫొటోలు తీయడం, కేకలు వేయడంతో మొసలి చెరువులోకి వెళ్లిపోయింది. చిన్నపిల్లలు, మేకలు, గొర్రెల కాపరులు చెరువు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


