మరికల్: మండల కేంద్రంలో శనివారం దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. పట్టణానికి చెందిన కొండాపూర్ బాల్‌రెడ్డి భార్యాపిల్లలతో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి రాగా ఇంటికి వేసిన తాళం విరగ్గొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువా తాళం కూడా పగలగొట్టి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ భగవంతురెడ్డి, ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడితో వివరాలు సేకరించగా.. బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.1.35 లక్షలు నగదు ఎత్తుకెళ్లిన్నట్లు బాధితుడు వాపోయాడు. క్లూస్ టీం బీరువాపై పడిన వేలిముద్రలను సేకరించారు. వారం వ్యవధిలోనే సరస్వతీదేవి ఆలయంలో, మరో మూడు ఇళ్లల్లో చోరీలు జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.


