అతివేగం.. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

అతివేగం.. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

గండేడ్‌: అతివేగానికి తోడు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు కారణమైన డ్రైవర్‌ స్పల్పగాయాలతో బయటపడ్డాడు. గండేడ్‌ మండలం రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన చాపల సిద్దయ్య (42) 40ఏళ్ల క్రితం వచ్చి మహబూబ్‌నగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ప్రధాన రహదారిపై చేపల దుకాణం నిర్వహిస్తూ.. టీటీగుట్ట సమీపంలోని చాంద్రాయణ్‌గుట్ట వద్ద నివాసముంటున్నాడు. చెరువుల వద్ద చేపలు పట్టి తెచ్చి అమ్ముతుండేవాడు. అందులో భాగంగానే శనివారం హన్వాడ మండలం పల్లెమోని కాలనీకి చెందిన రమశ్‌ (వాహన యజమాని), మహమ్మదాబాద్‌ మండలం చౌదర్‌పల్లి గొంగ్యాతండాకు చెందిన ముడావత్‌ రాహుల్‌ (డ్రైవర్‌)తో కలిసి పెద్దదర్పల్లి వద్ద ఐస్‌ నింపుకొని నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్‌పేట్‌ చెరువులో పట్టే చేపలు తీసుకురావడానికి గూడ్స్‌ క్యారియర్‌ వాహనంలో బయలుదేరారు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, అతివేగం కారణంగా రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి సర్వీస్‌ రోడ్డు రేయిలింగ్‌, డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దాదాపు 10 నుంచి 15 ఫీట్ల దూరం వరకు రేయిలింగ్‌ను తాకుతూ ముందుకెళ్లింది. దీంతో వాహనంలో ఉన్న చాపల సిద్దయ్య శరీరంలోకి డివైడర్‌ ఇనుప చువ్వలు దూసుకెళ్లాయి. రమేశ్‌ ఒక్కసారిగా ఎగిరి, 10 మీటర్ల దూరంలో రోడ్డుమీద పడిపోయాడు. అతడి నడుము, తొడభాగం పూర్తిగా ఛిద్రమైంది. డ్రైవర్‌ రాహుల్‌కు సైతం స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్‌ వచ్చే వరకు సిద్దయ్య బతికే ఉన్నాడు. వాహనంలో నుంచి బయటికి దించి, సైలెన్‌ ఎక్కించే లోపే తుదిశ్వాస విడిచాడు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మృతుడు సిద్దయ్యకు భార్య తులసి, ఏడేళ్ల కుమారుడు జశ్వంత్‌, ఆరేళ్ల కూతూరు నిఖిలశ్రీ, నాలుగేళ్ల కుమారుడు విశాల్‌ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.

మరో యువకుడి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement