● జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత
● అయ్యవారిపల్లిలో నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు
పాలమూరు: గ్రామీణస్థాయిలో పేదలకు న్యాయం సరైన విధంగా అందడం లేదని ఎన్నో నివేదికలు చెబుతున్నాయని, దీనికోసం న్యాయసేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. పారా లీగల్ వలంటీర్లు తమ దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందించి ఇరువురి సమస్య తెలుసుకొని, సాధారణంగా ఉంటే ప్రాథమిక దశలో అక్కడే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం కోయిలకొండ మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో న్యాయ అవగాహన సదస్సుతో పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయ్యవారిపల్లి గ్రామాన్ని మెగా డ్రైవ్ కింద ఎంపిక చేసి న్యాయ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదలకు అందాల్సిన పథకాలు చట్టపరంగా అందించేందుకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వేలు నిర్వహించి ప్రత్యేక నివేదికలు తయారు చేసి ఆయా ప్రభుత్వ శాఖలకు ప్రతిపాదనలు పంపించి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనకు గ్రామంలో చేపట్టాల్సిన చర్యలను చట్టపరంగా చేపట్టేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. పట్టింపులకు పోయి గొడవలు పెట్టుకొని కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు.ఏదైనా సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకువచ్చి రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో పలువురికి యూడీఐడీ లేబర్ కార్డులు న్యాయమూర్తి అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఇందిర, ఆంజనేయులు, మహ్మద్ ఆఫ్రోజ్ అక్తర్, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిని జరీనా బేగం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ధనుంజయగౌడ్, సర్పంచ్ వాగ్యరామునాయక్, డాక్టర్ కీర్తన పాల్గొన్నారు.
గ్రామంలో వైద్య శిబిరం.. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, జిల్లా వైద్యారోగ్యశాఖ–జనరల్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయడంతో పాటు ఇతర రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు పంపిణీ చేశారు.


