కూతురే.. కొండంత అండ | - | Sakshi
Sakshi News home page

కూతురే.. కొండంత అండ

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

● కూతురు పుడితే దిగులు పడిన రోజుల నుంచి.. ‘మా అమ్మాయి సాధించింది’ అంటూ గర్వపడే రోజుల్లోకి..

● ఇంటిని నడిపిన చేతులే.. ఇప్పుడు జిల్లాను నడిపిస్తున్నాయి

● ఐఏఎస్‌ నుంచి వైద్యం వరకు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న ఆడబిడ్డలు

● పెద్దమ్మాయి ఐఏఎస్‌.. చిన్నమ్మాయి బీటెక్‌ మూడో సంవత్సరం

● కష్టాలు ఎదురైనా.. పిల్లల చదువుకు ఏనాడూ ఆటంకం కలగనివ్వలేదు

7

కల కూతుళ్లది.. ప్రోత్సాహం తల్లిదండ్రులది

‘‘ఒక కూతురు ఎదిగితే.. ఒక కుటుంబం నిలబడుతుంది.. ఒక కూతురు గెలిస్తే.. మరో వంద మంది అమ్మాయిలకు కల పుడుతుంది.. అందుకే.. కూతురు భారం కాదు.. కొండంత అండ..’’ ఒకప్పుడు ఆడపిల్ల పుడితే.. ‘బాధ్యత మొదలైంది’ అనుకునేవారు. ఇప్పుడు అదే ఆడపిల్ల పుడితే.. ‘భవిష్యత్‌ వచ్చింది’ అంటున్నారు. చదువు కంటే పెళ్లి.. కలల కంటే కుటుంబం.. అవకాశాల కంటే ఆంక్షలే ముందుండే కాలం నుంచి.. కూతుళ్ల కలలకు రెక్కలు తొడిగి, వారు ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహించే దశకు సమాజం చేరింది. కూతురి కోసం తల్లిదండ్రులు పడిన కష్టాలు.. ఆమె విజయం ముందు చిన్నబోతున్నాయి. ఆదివారం జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా తమ కలలతో, తల్లిదండ్రుల అండతో, తమ విజయాలతో సమాజానికి కొత్త అర్థం చెబుతున్న ఆడబిడ్డల ప్రత్యేక కథనాలు..

పాలమూరు: ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారమని భావించే రోజులు.. ఇప్పుడు మారిపోయాయి. కొడుకులతో సమానంగా.. అంతకంటే ఎక్కువగా కూతుళ్లను చదివిస్తూ, వారి కలలకు రెక్కలు తొడుగుతున్నారు నేటితరం తల్లిదండ్రులు. కూతుళ్లు ఏ దారి ఎంచుకున్నా.. ఆ దారిలో వారికి అండగా నిలిస్తే చాలు.. వారు గమ్యాన్ని చేరుకుంటారనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం సురేష్‌రెడ్డి–మంజులత దంపతులు. అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన ఈ దంపతులు దాదాపు మూడు దశాబ్దాల కిందట పిల్లల చదువుల కోసం మహబూబ్‌నగర్‌లోని లక్ష్మీనగర్‌ కాలనీలో స్థిరపడ్డారు. గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూనే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొనసాగిన సురేష్‌రెడ్డి.. భార్య మంజులతతో కలిసి కుటుంబాన్ని నడిపించారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. ఇద్దరు కూతుళ్ల చదువుకు మాత్రం ఏనాడూ కొరత రానివ్వలేదు. అనన్యరెడ్డి, చరణ ఇద్దరికీ చిన్నప్పటి నుంచే ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్య అందించారు. ఆ తర్వాత ఉన్నత చదువుల్లోనూ పిల్లల అభిరుచులకే ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద కూతురు అనన్యరెడ్డి సివిల్‌ సర్వీసెస్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. గ్రాడ్యుయేషన్‌ కోసం ఢిల్లీకి పంపించి.. ఆమె లక్ష్యానికి అవసరమైన సహకారం అందించారు. పట్టుదలతో చదివిన అనన్యరెడ్డి 2024 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని డాహన్‌ జిల్లాలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కూతురు చరణ కూడా అక్క అడుగుజాడల్లో కాకుండా తనకంటూ మరో దారిని ఎంచుకుంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement