● 14 ఏళ్ల కూతురి జ్ఞాపకార్థంగుడి నిర్మించిన తండ్రి
అచ్చంపేట రూరల్: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు 14 ఏళ్లకే అనారోగ్యంతో దూరమైంది. ఆ బాధను జీర్ణించుకోలేక.. ఆమె జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు తల్లిదండ్రులు గుడి నిర్మించారు. నిత్యం అక్కడ దీపం వెలిగిస్తూ కూతురిని తలుచుకుంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లికి చెందిన మద్దరి రమేష్ అచ్చంపేట సివిల్ కోర్టులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వరలక్ష్మి. 2009లో వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు గీతిక 2011 జూలై 17న జన్మించింది. పుట్టిన సమయంలో తలెత్తిన సమస్యలతో అనారోగ్యానికి గురైన గీతికకు 14 ఏళ్ల పాటు చికిత్స అందించారు. చివరకు 2024 అక్టోబర్ 21న మృతి చెందింది. కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు ఆమె జ్ఞాపకార్థం స్వగ్రామంలోని తమ స్థలంలో చిన్న గుడి నిర్మించి, ప్రతిమ ఏర్పాటు చేశారు. రోజూ అక్కడ దీపం వెలిగిస్తూ.. గుర్తొచ్చినప్పుడల్లా కాసేపు కూర్చుని కూతురి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ‘‘పాపను ప్రాణంలా పెంచాం. విధి మాకు దూరం చేసినా.. ఆమె జ్ఞాపకాలను మాత్రం మరిచిపోలేకపోతున్నాం. మా కళ్లెదుటే ఉన్నట్టుగా అనిపించేందుకు గుడి కట్టాం. పుట్టినరోజు, వర్ధంతి రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తాం. గుర్తొచ్చినప్పుడల్లా గుడి వద్దకు వెళ్లి కాసేపు కూర్చుంటాం’’ అని తండ్రి రమేష్ కన్నీటి పర్యంతమయ్యారు.


