ఇక డింఢీ..! | - | Sakshi
Sakshi News home page

ఇక డింఢీ..!

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీటి తరలింపుపై అగ్గి రాజుకోనుంది. పాలమూరు ప్రజలు, రైతాంగానికి నష్టం వాటిల్లుతుందని.. అడ్డుకోవాలంటూ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలతో యుద్ధం మొదలు పెట్టిన ఉమ్మడి జిల్లా పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు లీడర్లలో చలనం వచ్చేలా ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిండి ప్రాజెక్ట్‌ పూర్వపరాలు, ప్రస్తుత పరిస్థితులు, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పోరు సన్నాహాలపై ‘సాక్షి’ ఫోకస్‌..

ఉమ్మడి ఏపీలో ఇలా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పంపింగ్‌ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ఎస్‌ఎల్‌బీసీ భూగర్భ టన్నెల్‌ తవ్వకానికి శ్రీకారం చుట్టారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రధాన కాల్వ ద్వారా వచ్చే నీటిలో కొంత భాగాన్ని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి లింక్‌ కాల్వల ద్వారా ఎగువన ఉన్న డిండి రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్‌ చేశారు. అయితే టన్నెల్‌ నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురుకావడం.. నిధుల విడుదలలో జాప్యంతో పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌లో తెరపైకి.. అభ్యంతరాలతో వెనుకడుగు

తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృష్ణా జలాల పునర్విభజన, రీడిజైన్‌ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పాత డిండి లింక్‌ ప్రతిపాదనను రీడిజైన్‌ చేసి రూ.6 వేల కోట్లకు పైగా అంచనాతో ప్రత్యేక ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. ఎస్‌ఎల్‌బీసీపైనే ఆధారపడకుండా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల నుంచి డిండికి కృష్ణా జలాలను ఎత్తిపోసేలా మార్పు చేశారు. దీనిపై ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది.

కాంగ్రెస్‌.. వచ్చీ రావడంతో..

2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. పీఆర్‌ఎల్‌ఐలో భాగంగా వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండికి నీళు్‌ల్‌ తరలించేలా ప్రతిపాదించిన ఏదుల–ఉల్పర లింక్‌ పనుల కోసం గతేడాది రూ.1,800 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అయితే డిండికి నీటి తరలింపుపై తొలి నుంచీ వ్యతిరేకంగా ఉన్న పాలమూరు రైతులు, ప్రజలు, జల సాధన సమితి, అధ్యయన వేదిక రేవంత్‌ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడు వ్యతిరేకం, ఇప్పుడు మౌనమా?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదుల నుంచి డిండికి నీటి మళ్లింపు తెరపైకి రాగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని విన్నవించడంతో పాటు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అప్పుడు డిండికి పాలమూరు నుంచి నీటిని తరలించొద్దని జూపల్లి కృష్ణారావు లేఖ రాశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి.. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై నోరు మెదకపోవడంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు.

ఉద్యమ తీవ్రత పెంచేలా..

డిండి ప్రాజెక్ట్‌కు వ్యతిరేక ఉద్యమంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీల నేతలు కలిసి వచ్చేలా జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, ప్రతినిధులు వీరబ్రహ్మచారి, బెక్కెం జనార్దన్‌, చెన్న కిష్టయ్య, బండెల రాంచంద్రారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవాచారి తదితరులు చర్చించుకుని తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా ఆదివారం ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర చేపట్టనుంది. ఈ యాత్రకు ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హాజరుకానున్నారు. యాత్ర వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పేరిట బహిరంగ లేఖలు విడుదల చేయనున్నారు. కల్వకుర్తిలో ఆర్డీఓ తదితర అధికారులకు వినతిపత్రాలు అందించనున్నారు. దశల వారీగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, వంటావార్పు, నిరసనలు.. ఇలా పోరు కార్యాచరణను వెల్లడించనున్నట్లు సమాచారం.

పోరుకు శ్రీకారం చుట్టిన జేఏసీ

డిండికి నీటి తరలింపునకు సంబంధించి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలోని ఏదుల నుంచి 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్‌ కాల్వతో పాటు 16 కి.మీల సొరంగం.. ఆ తర్వాత 3.05 కి.మీల మేర కాల్వను నిర్మించి దుందుభీ నదిలోకి నీళ్లు పోస్తారు. అక్కడ నీటిని మళ్లించేందుకు పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్‌ డ్యాం నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఆయా చోట్ల రిజర్వాయర్లు, కాల్వల పనులు మొదలు కాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ పోరుకు శ్రీకారం చుట్టింది. పాలమూరు నీళ్లను డిండికి తరలించొద్దని కోరుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు రాసింది. అంతేకాదు.. పోరు కార్యాచరణను రూపొందించుకుని ముందుకుసాగుతోంది. ఈ మేరకు డిండి పరిధిలో రిజర్వాయర్లు, కాల్వల సందర్శన చేపట్టి.. రైతులు, వివిధ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పోరు సన్నాహాలు ముమ్మరం చేసింది.

డిండికి పాలమూరు నీటి తరలింపుపై జేఏసీ పోరు బాట

ప్రజల్లో చైతన్యంతోపాటు ప్రజాప్రతినిధులపై

ఒత్తిడి పెంచేలా కార్యాచరణ

ఇప్పటికే అడ్డుకోవాలని బహిరంగ లేఖలు రైతులు, సంఘాల నేతలతో భేటీ

నేడు ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర... సీఎం పేరిట విజ్ఞాపన పత్రం

హాజరుకానున్న ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement