పెళ్లి పీటల బదులు పాడె..
● 16 రోజులుగా కొడుకు కోసం
తల్లిదండ్రుల కన్నీటి నిరీక్షణ
● పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు
పాడెక్కడంతో కన్నవారి గుండెల్లో
తీరని శోకం
మదనాపురం: ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు తమకు ఆసరాగా నిలుస్తాడని.. త్వరలోనే పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేద్దామని ఎదురుచూశారు. కానీ విధి వారి ఆశలపై పిడుగు వేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 16 రోజులుగా మృత్యువుతో పోరాడిన కుమారుడు చివరకు కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన గొడుగు వెంకటన్న, ఆయన భార్య తమ రెండో కుమారుడు జితేందర్ (26)ను ఎంతో కష్టపడి పెంచారు. చేతికొచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడని, త్వరలోనే పెళ్లి చేసి సంసార బాధ్యతలు అప్పగించాలని ఆశించారు. ఆ కలలు నెరవేరేలోపే జితేందర్ జీవితం అర్ధంతరంగా ముగిసింది.
బైక్ ప్రమాదంతో..
ఈ నెల 9న పనిమీద బైక్‌పై జడ్చర్లకు వెళ్లిన జితేందర్ తిరుగు ప్రయాణంలో మూసాపేట వద్ద మరో బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చెవుల నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 సిబ్బంది అతడిని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కొడుకు ప్రాణాలు దక్కితే చాలని భావించిన ఆ పేద తల్లిదండ్రులు ఉన్నదంతా ఖర్చు పెట్టారు. దొరికిన చోటల్లా అప్పులు చేశారు. ఏకంగా రూ.15 లక్షలకు పైగా వైద్యం కోసం వెచ్చించారు. ఆసుపత్రి వైద్యులు శ్రమిస్తుండగా.. తమ బిడ్డ ఎప్పుడో ఒకప్పుడు కళ్లు తెరుస్తాడనే ఆశతో తల్లిదండ్రులు 16 రోజులుగా ఆసుపత్రిలోనే ఎదురుచూశారు. దేవుడిని వేడుకుంటూ కన్నీటితో గడిపారు. కానీ వారి ప్రార్థనలు ఫలించలేదు.
రేపో మాపో కొడుకుకు పెళ్లి చేసి ఇంట్లో పందిరి వేయాల్సిన ఆ తల్లిదండ్రులు.. చివరకు అతడి పాడె మోయాల్సి వచ్చింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వయసులోనే తమ బిడ్డను కోల్పోయిన కన్నవారి రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో విషాదాన్ని నింపాయి. ‘నిన్నటి వరకు కళ్లముందే తిరిగిన బిడ్డ.. ఇలా మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడా’ అంటూ వారు విలపించిన తీరు చూపరులను కలచివేసింది. జితేందర్ మృతితో దుప్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


