భార్యను హత్య చేసేందుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసేందుకు యత్నం

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

భర్త అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

కోస్గి రూరల్‌: భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన గోండ్ల వెంకటమ్మకు 14 ఏళ్ల క్రితం అంజిలయ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే భార్య ఫిర్యాదు మేరకు అంజిలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు అప్పటి నుంచి భార్య, కుమార్తెలను వేధిస్తూ హత్య చేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 20న కుమార్తె అనారోగ్యానికి గురై పాఠశాల నుంచి ఉపాధ్యాయురాలు ఫోన్‌ చేయడంతో వెంకటమ్మ ఇద్దరు కుమార్తెలను తీసుకుని పోతిరెడ్డిపల్లికి వచ్చింది. ఈ క్రమంలో 23న తెల్లవారుజామున వెంకటమ్మ, కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో అంజిలయ్య భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంకటమ్మ గట్టిగా కేకలు వేయడంతో కుమార్తెలు మేల్కొని తండ్రి నుంచి తల్లిని కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అంజిలయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

బైక్‌ అదుపుతప్పి

ఒకరు మృతి

అమ్రాబాద్‌: బైక్‌పై నుంచి పడి ఒకరు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి పదర మండలం ఉడిమిళ్ల సమీపంలో చోటుచేసుకుంది. పదర మండలం ఉడిమిళ్లకు చెందిన రాజగిరి పరశురాములు(39), దేవరాజు మంగళవారం పదరకు వచ్చారు. రాత్రి తిరిగి బైక్‌పై ఉడిమిళ్లకు వెళ్తుండగా.. గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి ప్రైవేట్‌ వాహనంలో పదర ఆస్పత్రికి వెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజగిరి పరశురాము లు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపా రు. మెరుగైన వైద్యం కోసం దేవరాజును హైదరాబాద్‌కు తరలించారు. బుధవారం మృతుడి శవానికి పోస్టుమార్టం నిర్వహించి కటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పరశురాములు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

అడ్డాకుల: మహబూబ్‌నగ ర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో ఇంటి వద్ద కరెంటు మోటార్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన బుధ వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీభాయి(45), చిన్న జంగోజీ దంపతులు. భర్త జంగోజీ ఆర్‌టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి నలుగురు కుమార్తెలు ఉండగా భార్యఇంటి వద్ద చిన్న కిరాణం కొట్టు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. పాత ఇంటికి ఇటీవల కరెంట్‌ పనులను చేయిస్తున్నారు. ఈక్రమంలో సాయంత్రం ఇంటి వద్ద కరెంటు మోటార్‌ ఆన్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా లక్ష్మీభాయి ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురైంది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తల్లిని కోల్పోయిన నలుగురి కుమార్తెల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఓ కుమార్తె చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. నిరుపేద కుటుంబం కావడంతో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సాంబారులో పడి

బాలుడికి తీవ్రగాయాలు

గండేడ్‌: వినాయకు డి మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో సాంబారులో పడి బాలుడికి గాయాలైన ఘ టన మండలంలోన జిన్నారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గండేడ్‌ మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్యకు రెండో కుమారుడు బిట్టు బుధవారం ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వంటలు మండపానికి ఆనుకొని వండుతున్నారు. అనుకోకుండా బిట్టు వంటలు చేసే దగ్గరికి వెళ్లాడు. అక్కడే తిరుగాడాడు. బిట్టు సాంబారు బాగ్‌వాన దగ్గరకి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. దీంతో బిట్టుకు ముందు వెనక భాగాలు తీవ్రంగా కాలాయి. వెంటనే కుంటుబీకులు కోస్గి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం 108 సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్త జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement