మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సాధారణంగా వినాయక విగ్రహాలను లారీలు, ట్రాక్టర్లు, కార్లు, జీపులు, ఆటో ట్రాలీలు తదితర వాహనాల్లో ప్రత్యేకంగా అలంకరించి డప్పువాయిద్యాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నిమజ్జనం కోసం సమీప వాగులు, వంకలు, చెరువులు, నదికి తరలించడం చూస్తుంటాం.. అయితే ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఆర్టీసీ బస్సులో నిమజ్జనం కోసం తరలించారు మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని వీరన్నపేట వాసులు. ఇక్కడి కొత్తగేట్ వద్ద శ్రీహిందూ నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14న వినాయకుడి విగ్రహాన్ని మండపంలో ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేరారు. చివరి రోజు బుధవారం ఉదయం నిర్వాహకులు రెండు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. ఒక్కో దానికి రూ.36,850 చొప్పున సంస్థకు చెల్లించారు. ఒక దాంట్లో విగ్రహాన్ని ఉంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ రెండు బస్సులలో సుమారు 115 మంది భక్తులు కుటుంబసమేతంగా బయలుదేరారు.


