మురుగుకు చెక్‌.. నీటికి పక్కా ప్లాన్‌! | - | Sakshi
Sakshi News home page

మురుగుకు చెక్‌.. నీటికి పక్కా ప్లాన్‌!

Aug 21 2026 7:15 AM | Updated on Aug 21 2026 7:15 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా విస్తరించిన మహబూబ్‌నగర్‌లో పెరుగుతున్న జనాభా, గృహసముదాయాలకు అనుగుణంగా మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మురుగునీరు, వర్షపు నీరు కలవకుండా ప్రత్యేక పైప్‌లైన్లు, మురుగునీటి శుద్ధికి మూడు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్టీపీ), తాగునీటి సరఫరాకు 14 వాటర్‌ ట్యాంకుల నిర్మాణం చేపడుతోంది. మూడు పథకాల కింద మొత్తం రూ.1,099 కోట్ల నిధులు కేటాయించారు.

మూడు ఎస్టీపీలు.. 42 ఎంఎల్‌డీ సామర్థ్యం

అమృత్‌ 2.0 కింద రూ.276 కోట్లతో మూడు ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. పాలకొండ వద్ద 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మొదటి ప్లాంట్‌ పనులు కొనసాగుతున్నాయి. పెద్దచెరువు వద్ద 15.5 ఎంఎల్‌డీ ప్లాంట్‌కు భూసేకరణ పూర్తయింది. అమిస్తాపూర్‌–సారికాటౌన్‌షిప్‌ వద్ద 21.5 ఎంఎల్‌డీ ప్లాంట్‌కు భూసేకరణ ప్రక్రియలో ఉంది. కాలనీల నుంచి మురుగునీటిని ఎస్టీపీలకు తరలించేందుకు 540 కిలోమీటర్ల సీవర్‌ పైప్‌లైన్‌, 12.5 కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. శుద్ధి చేసిన నీటిని వ్యవసాయ, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుంది.

తాగునీటికి 14 ట్యాంకులు

కార్పొరేషన్‌ పరిధిలో తాగునీటి సేకరణ, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బైపాస్‌ చుట్టూ 14 వాటర్‌ ట్యాంకులు నిర్మిస్తున్నారు. యూఐడీఎఫ్‌ కింద రూ.220 కోట్లు కేటాయించారు. ఇప్పటికే తొమ్మిది ట్యాంకులకు పనులు ప్రారంభం కాగా.. మరో మూడు ట్యాంకులకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. నీటి పంపిణీ కోసం 209 కి.మీ. డిస్ట్రిబ్యూషన్‌, 39.78 కి.మీ. మెయిన్‌ఫీడర్‌ పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు.

వర్షపు నీటికి ప్రత్యేక వ్యవస్థ

మురుగునీరు, వర్షపు నీరు కలవకుండా ప్రత్యేక అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థను రూ.603 కోట్లతో చేపడుతున్నారు. ఇందులో 540 కి.మీ. సీవర్‌ పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. వర్షపు నీరు వేర్వేరుగా వెళ్లేలా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో నీటి కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు చెరువులు, కుంటలకు స్వచ్ఛమైన వర్షపు నీటిని చేరవేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పాల్కొండ వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కార్పొరేషన్‌లో రూ.1,099 కోట్లతో మౌలిక వసతుల పనులు

మురుగు, వర్షపు నీటికి వేర్వేరు పైప్‌లైన్లు.. మూడు ఎస్టీపీల నిర్మాణం

తాగునీటి కోసం 14 వాటర్‌ ట్యాంకులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement