జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమర్థవంతంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి సంక్షేమ హాస్టళ్ల అధికారులతో వీసీ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులకు సురక్షితమైన వసతి, నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య అందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు, బెడ్డింగ్, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, ఇతర అవసరమైన సామగ్రి సకాలంలో పంపిణీ చేయాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హాజరు, పరీక్షల ఫలితాలు, మార్కుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచాలని, అనారోగ్యానికి గురైన విద్యార్థులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి త్రైమాసికం తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి, విద్యార్థుల చదువు, ఆరోగ్యం, ప్రవర్తన, సంక్షేమంపై తల్లిదండ్రులతో చర్చించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం క్రీడలు, సాంస్కృతిక, ఇతర సహ పాఠ్య కార్యక్రమాలు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హాస్టళ్లను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడా మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరగకుండా అవసరమైన ఫాగింగ్, యాంటీ లార్వా ఇతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


