భూత్పూర్: ఆయిల్ పాం రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. బుధవారం భూత్పూర్ మండలంలోని తాటికొండ రైతువేదికలో జిల్లాకు చెందిన ఆయిల్‌పాం రైతులకు ప్రీ యూనిక్(ఇండియా) ధ్వర్యంలో 100వ ఆయిల్ పాం ముచ్చట్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కురవడంలేదని, రాబోయే ఏళ్లలోనూ సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ఆయిల్‌పాం సాగుపై దృష్టిసారించాలన్నారు. సాగులో సందేహాలను జిల్లా ఉద్యానవన శాఖాధికారుల నుంచి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
● జడ్చర్ల రైతువేదికలో జరిగిన గ్రోమోర్ నానో ఫర్టిలైజర్ యూరియాపై మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గంలోని ఏడీఏ, ఏఓ, ఏఈఓల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, మీసేవ పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఎస్‌ఐఆర్ పురోగతిపై తహసీల్దార్ కిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్, డీఏఓ గోవింద్‌నాయక్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఈఓ శ్రీదేవి, ఏవో మురళీధర్, హార్టికల్చర్ ఆఫీసర్ శృతి, హార్టికల్చర్ ఏఈఓ మహ్మద్ ఖదీర్, ప్రియూనిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ బాలరాజు, ఏడీఏ, ఏఓ, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
వైద్య పరీక్షల వివరాలు
ఎందుకు నమోదు చేయలేదు
భూత్పూర్ పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 11:15 గంటలైనా వైద్యాధికారి డా.అబ్దుల్‌రబ్ ఆస్పత్రికి రాకపోవడంతో పీఏతో ఫోన్ చేయించారు. 15 నిమిషాల తర్వాత డాక్టర్ అక్కడికి చేరుకున్నారు. వచ్చిన డాక్టర్‌ను ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు సంబంధించి రికార్డులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వంద రోజుల ప్రజాపాలనలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షల వివరాల రికార్డులను ఎందుకు నమోదు చేయలేదని కలెక్టర్ ప్రశ్నించారు. మహిళ వ్యాధుల సంబంధించిన వ్యాధి పరీక్షల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు


