మహబూబ్‌నగర్ క్రైం: యువత తమ భవిష్యత్‌ను నిర్మించుకునే కీలకదశలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ డి.జానకి అన్నారు. నగరంలోని ఎస్‌వీఎస్ డెంటల్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తుల జీవితాలు ఎలా చెడిపోతాయి అనే అంశంపై వీడియోలను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం కారణంగా వ్యక్తి తన ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, విద్య, ఉపాధి అవకాశాలు సమాజంలో గౌరవం కోల్పోతాడని వెల్లడించారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత స్వీకరించి, ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తుంటే వెంటనే 1908 లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఈగల్ ఫోర్స్ డీఎస్పీ బుచ్చయ్య, ఎస్‌వీఎస్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ దామోదర్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
బీసీ స్టడీ సర్కిల్‌లో
ఉచిత శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్‌లో గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
సమాజసేవలో
పీయూ ముందుంటుంది
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సమాజ సేవలో పీయూ ముందుంటుందని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మాపూర్‌లో పీయూఎంఎస్‌డబ్ల్యూ విభాగం, ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించేందుకు పీయూ తనవంతుగా సేవలు అందిస్తుందన్నారు. ఎక్కడికో వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామానికి వచ్చిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరారు. ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పుస్తక విజ్ఞానంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలనిసూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, సర్పంచ్ రాజుగౌడ్, డాక్టర్లు పవన్‌కుమార్, సింధు, మణికంఠరాజు, ఆప్రీన్, విజయ, అంజని, మనోహర్, అధ్యాపకుడు గాలెన్న పాల్గొన్నారు.
తెలుగు పండితులు మార్గదర్శకులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాఠశాలల్లో తెలుగు పండితులకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వారు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉంటారని డీఈఓ విజయకుమారి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని మాడల్ బేసిక్ పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూవిద్యార్థులకు భాష అభిరుచి ఎంతో ముఖ్యమని, వారి అభిరుచికి అనుగుణంగా బోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా భాషపై మమకారంతో తెలుగు భాష ఉపాధ్యాయురాలిగా పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కవులు రాసిన పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఇటీవల రిటైర్మెంట్ అయిన తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్, ఉపాధ్యాయులు రామ్మోహన్, వెంకటేశ్వరశర్మ, గిరిజరమణ, చక్రవర్తిగౌడ్, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.


