కాగితాలకే పరిమితమైన అంగన్‌వాడీ సంక్షేమ పథకాలు
● ప్రతి ముగ్గురిలో ఒకరికి ఎదుగుదల లోపం
● ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా దక్కని పౌష్టికాహారం
● తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం, సిబ్బంది నిర్లక్ష్యమే శాపం
జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మహిళా, శిశు సంక్షేమశాఖ తాజాగా నిర్వహించిన 0–5 ఏళ్ల చిన్నారుల పోషకాహార అంచనా సర్వేలో జిల్లాలో ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. అలాగే ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువుతో ఉన్నారు. జిల్లాలో మొత్తం 54,492 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా, వారిలో 54,082 మంది (99.25 శాతం) పిల్లలకు తూకం, ఎత్తు కొలిచి పోషకాహార స్థితిని అంచనా వేశారు.
నేటి బాలలే రేపటి పౌరులు.. ఆరోగ్యవంతమైన సమాజానికి వారే మూలస్తంభాలు. కానీ, జిల్లాలో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రేపటి తరం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం, తల్లిదండ్రుల అవగాహనరాహిత్యం వెరసి పోషకాహార లోపం చిన్నారులను వెంటాడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఎదుగుదల లోపంతో, తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో నీరసించిపోతున్నారనే చేదు నిజం కలవరపెడుతోంది. – మహబూబ్‌నగర్ రూరల్
● జిల్లాలో మొత్తం పరీక్షించిన పిల్లల్లో 19,070 మంది (35.26 శాతం) ఎదుగుదల లోపంతో ఉన్నారు. వీరిలో 11,846 మంది మధ్యస్థ, 7,224 మంది తీవ్ర ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. చిన్ననాటి పోషకాహార లోపం దీర్ఘకాలికంగా కొనసాగితే భవిష్యత్‌లో శారీరక సామర్థ్యం, మెదడు వికాసం, చదువులో ప్రతిభపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
● 7,736 మంది (14.30 శాతం) చిన్నారులు ఎత్తుతో పోలిస్తే తక్కువ బరువుతో ఉన్నారు. 6,421 మంది మధ్యస్థ, 1,315 మంది తీవ్ర తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితి రోగ నిరోధక శక్తిని తగ్గించి తరచూ అనారోగ్యానికి గురిచేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
● పోషకాహార లోపం పరంగా 2,561 మంది చిన్నారులు గుర్తించారు. ఇందులో 2,145 మంది మధ్యస్థ, 416 మంది తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నారు. ఈ చిన్నారులకు ప్రత్యేక వైద్యసేవలు, అధిక పోషకాహారం, నిరంతర పర్యవేక్షణ అత్యవసరమని చెబుతున్నారు. దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్‌ననగర్ రూరల్ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ బరువు, ఎదుగుదల లోపం పట్టణ ప్రాంతంతో పోలిస్తే ఎక్కువగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన లోపం, సమతుల్య ఆహారం అందకపోవడం, తరచూ అంటువ్యాధులు రావడం వంటి అంశాలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు, వేడి భోజనం, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ ఆశించినస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. గర్భిణుల నుంచే పోషకాహారంపై దృష్టి పెట్టడం, పుట్టిన తర్వాత తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు ఇవ్వడం, ఆ తర్వాత అనుబంధ ఆహారం సక్రమంగా అందించడం, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాహార లోపం ఉన్న వారు
జిల్లాలోఅంగన్‌వాడీ కేంద్రాలు
మొత్తం చిన్నారులు


