మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలి

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా

జడ్చర్ల: మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బుగుప్తా ఆదేశించారు. జడ్చర్లలో అకాల వర్షం శీర్షికన వచ్చి గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ హరిప్రియతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కొందరు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గన్నీబ్యాగులు తదితర సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో లారీలు రాకపోవడం, హమాలీల సమస్యతోపాటు గోదాంలు ఖాలీగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా తాము కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొనడం లేదని పలువురు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వర్షం వస్తే మొక్కజొన్నకు తీరని నష్టం కలుగుతుందని, బుధవారం కురిసిన వర్షానికి మొక్కజొన్న తడిసిపోయిందని వెంటనే కొనుగోలు చేసి తమ ఇబ్బందులను తీర్చాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో సకాలంలో మొక్కజొన్నను కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కొనుగోలు చేసిన బస్తాలను మార్కెట్‌షెడ్లలోనే నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సింగిల్‌విండో అధికారులు, పాలకమండలి సభ్యులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌ యార్డులో గోదాములకు సంబంధించిన వివరాలను సంబంధిత కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డీఎం రహెమున్నిసా భేగం, తహసీల్దార్‌ నర్సింగరావు, సింగిల్‌విండో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, మార్కెట్‌ సెక్రటరీ అశ్వక్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement