ఈ–నామ్‌ మరింత వేగం | - | Sakshi
Sakshi News home page

ఈ–నామ్‌ మరింత వేగం

Feb 28 2026 8:33 AM | Updated on Feb 28 2026 8:33 AM

ఈ–నామ

ఈ–నామ్‌ మరింత వేగం

అచ్చంపేట: దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల పరిధిలో కొనసాగుతున్న ఈ–నామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) ఆధునీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఉత్పత్తులను డిజిటల్‌ విధానంలో విక్రయించే ఈ–నామ్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్‌ చేస్తూ 2.0 వెర్షన్‌ ప్రారంభించేందుకు కేంద్ర వ్యవసాయ, సహకార శాఖ సిద్ధమైంది. ప్రస్తుతానికి దేశంలో కొనసాగుతున్న పాత వెర్షన్‌కు పలు సాంకేతిక ఆటంకాలు తలెత్తడంతో వ్యవస్థను మరింత శక్తివంతంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి మహబుబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 19 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. షాద్‌నగర్‌, ఆమనగల్లు, కొండగల్‌ రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోకి వెళ్లడంతో ప్రస్తుతం 16 మార్కెట్లు ఉన్నాయి.

ఎస్‌ఎఫ్‌ఏసీ సంస్థకు బాధ్యతలు

రాష్ట్రంలో ఈ–నామ్‌ సేవలు డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌(డీఎంఐ) పర్యవేక్షణలో ఎస్‌ఎఫ్‌ఏసీ సంస్థ ఆధ్వర్యంలో 2016 నుంచి కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి 97 మార్కెట్‌ యార్డుల్లో 1.0 వెర్షన్‌తో ఈ–నామ్‌ ఆమల్లో ఉండగా.. వాటిలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ ఒకటి. 2016 నుంచి 2026 ఫ్రిబవరి 22 వరకు కొనసాగుతున్న పాత వెర్షన్‌ను మార్చి మరింత వేగవంతంమైన 2.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు పూర్తిచేసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి బాధ్యతలను ఎస్‌ఎఫ్‌ఏసీ సంస్థకు అప్పగిస్తూ టెండర్‌ మంజూరు చేసింది.

23 నుంచి 2.0 వెర్షన్‌..

ఈ నెల 23 న ఢిల్లీ నుంచి పర్చువల్‌గా ఈ–నామ్‌ 2.0 వెర్షన్‌ ప్రారంభం కానుండగా.. రాష్ట్రంలోని ఎంపికై న మార్కెట్లలో ఈ సేవలు అమలులోకి రానున్నాయి. మార్కెట్‌ యార్డులో కంప్యూటర్ల ద్వారానే ట్రేడింగ్‌ నిర్వహించే విధంగా కొత్త విధానాన్ని రూపొందించారు.

20 కోట్ల మంది రైతులు

ప్రస్తుతం ఈ–నామ్‌ డేటాబేస్‌లో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది రైతుల వివరాలు నమోదై ఉన్నాయి. కొత్త వెర్షన్‌లో రైతులు మార్కెట్‌కు వచ్చిన వెంటనే వారి పేరుతో ఆటోమెటిక్‌ రిజిస్ట్రేషన్‌, అన్నదాతలు, ట్రేడర్‌, కమీషన్‌ ఏజెంట్లకు ఆన్‌లైన్‌ యూనిక్‌ ఐడీ కార్డులు జారీ, డిజిటల్‌ రికార్డు మేనేజ్‌మెంట్‌ వంటి సౌకర్యాలు అందించనున్నారు. దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా ఈ–నామ్‌ ప్లాట్‌ఫాంపై ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా ధర పారదర్శకత పెరగడంతో పాటు, మధ్యవర్తుల ప్రభావం తగ్గి రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.

ఏఎంసీలో ఏర్పాట్లు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో ప్రస్తుతం 10 ట్రేడర్లు, 34 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నప్పటికీ, రోజువారీగా ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే ట్రేడర్లు మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. పాత వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో సర్వర్లు తరుచూ మొరాయించడంతో కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యలను పూర్తి స్థాయిలో నివారించేలా కొత్త వెర్షన్‌ రూపొందించినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్‌లో భాగంగా మార్కెట్‌ యార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో సబ్సిడీ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

పోర్టల్‌లో వివరాల నమోదు..

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 25 నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు ప్రభుత్వం ఆధునీకరించిన ఈ– నామ్‌ 2.0 పోర్టల్‌ ద్వారా మాత్రమే నిర్వహిస్తా రు. ఇప్పటి వరకు ఉపయోగించిన ఈ–నామ్‌ 1.0 వ్యవస్థకు బదులుగా కొత్త సౌకర్యాలు, ఆధునిక పద్ధతులు అమల్లోకి రానున్నాయి, రైతులు తప్పనిసరిగా ఈ–నామ్‌ 2.0 పోర్టల్‌లో తవ వివరాలు నమోదు చేసుకోవాలి.

వెర్షన్‌ 2.0కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

ఈ నెల 23న ఢిల్లీ నుంచి

వర్చువల్‌గా ప్రారంభం

ఉమ్మడి జిల్లాలో 19 మార్కెట్లు

రైతులకు యూనిక్‌ ఐడీ నంబర్‌

కొత్త వెర్షన్‌తో మెరుగైన ధరలు

ఈ–నామ్‌ మరింత వేగం 1
1/1

ఈ–నామ్‌ మరింత వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement