సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్
జడ్చర్ల: మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా కిరాణా షాపులో ఉన్న మహిళ మెడలో రెండు తులాల పుస్తెలతాడును లాక్కొని సినీతరహాలో పరారైన ఘటన ఒక్కసారిగా పట్టణంలో కలకలం రేపింది. స్థానిక బండమీది కిష్టారెడ్డి నగర్‌లో మంజుల అనే మహిళ కిరాణా దుకాణం నిర్వహణతోపాటు టైలరింగ్ నిర్వహిస్తుంది. శుక్రవారం దుకాణంలో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన ముగ్గురు యువకులు పక్కా ప్రణాళికతో ఒకే బైక్‌పై వచ్చి దుకాణం ఎదుట నిలిపారు. ఒక యువకుడు దుకాణం దగ్గరకు వెళ్లగా.. మిగతా ఇద్దరు యువకులు ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి బైక్‌పై ఉన్నారు. దుకాణం దగ్గరకు వెళ్లిన యువకుడు వాటర్ బాటిల్ కావాలని అడుగుతూ మెడలో ఉన్న పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారు. పుస్తెలతాడు చేతికి దొరగ్గానే మిగతా ఇద్దరు యువకులు బైక్‌ను ముందుకు స్పీడ్‌గా తోలారు. పుస్తెలతాడు చేజిక్కించుకున్న యువకుడు బైక్ వెనుక ఓ పది అడుగులు పరిగెత్తి ఎగిరి బైక్‌పై కూర్చున్నాడు. ఒక్కసారిగా బిత్తరపోయిన బాధితురాలు దుకాణం బయటకు వచ్చి కేకలు వేసేసరికే వారు అదృశ్యమయ్యారు. బైక్‌పై దుండగులు గౌరీశంకర్ కాలనీలో ప్రధాన రహదారి మీదుగా సిగ్నల్‌గడ్డ–నేతాజీ చౌక్ ప్రధాన రహదారిపైకి చేరుకుని పరారయ్యారు. ఇందుకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాలతోపాటు రహదారిపై అమర్చిన సీసీ కెమెరాలలో దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ కమలాకర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని విచారించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకొని పారిపోతున్న సీసీ ఫుటేజీ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పట్టణవాసులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అసలే బంగారం ధరలు ఆకాశన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైన్ స్నాచింగ్ పట్టణ వాసులను దిగ్బ్రాంతికి గురిచేసింది. రెండు తులాల పుస్తెలతాడును దుండగులు అపహరించారని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
జడ్చర్లలో పట్టపగలే పుస్తెలతాడులాక్కొని బైక్‌పై పరారీ
కిరాణా దుకాణానికి వాటర్ బాటిల్ కోసం వచ్చి అపహరణ
సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసుల ముమ్మర దర్యాప్తు
సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్


